జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నయానా భయానా, సామ, దాన, బేధ, దండోపాయాలు ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో గెలవాలని తాపత్రయపడుతోందని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్. రామసుందర రెడ్డిని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గసమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో ఓడితే మంత్రులంతా నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు చేయాలని చెప్పడం, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వనని చెప్పాడన్నారు. సీఎం మాటలు చూస్తుంటే, ఎన్నికల్లో ఎక్కడ అధికారపార్టీ ఓడిపోతుందోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని, అనుకున్నస్థాయిలో అధికారపార్టీకి ఫలితాలు రావన్న భయంకూడా ఆయనలో కనిపిస్తోందని రామయ్య ఎద్దేవాచేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచే, జగన్ ముఖ్యమంత్రిగా పరిగణింపబడరని, కేవలం వైసీపీ అధినేతగా మాత్రమే వ్యవహరించబడతారని, అటువంటి వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక నిఘా యాప్ ను ఆవిష్కరించాడన్నారు. ఆ విధంగా యాప్ ను ఆవిష్కరించే అధికారం ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు ఉండదని, ఒక పార్టీ అధినేతగా ఉన్న ఆయన, అధికారయంత్రాంగం చేయాల్సిన పనిని తాను చేయడం రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధమన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, తప్పుచేసినవారిని పట్టుకోవడం, అభ్యర్థులు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కే ఉంటుందని రామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక, దానికి విరుద్ధంగా నిఘా యాప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించడం చట్టవిరుద్ధం కాదా అని వర్ల ప్రశ్నించారు. చట్టాలు గౌరవించాల్సిన వ్యక్తే, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తే, కోడ్ ఆఫ్ కండక్ట్ ను ధిక్కరించడం జరిగిందన్నారు. అటువంటి పనికి పాల్పడినందుకు తనపై ఏం చర్యలు తీసుకోవాలో జగన్మోహన్ రెడ్డే చెప్పాలన్నారు. జగన్ నిఘా యాప్ ను ఆవిష్కరిస్తుంటే, అధికారులు దాన్ని నిరోధించకుండా, పక్కనే ఉండి ఆయనకు సహకరించారని, కాబట్టి వారుకూడా శిక్షార్హులే అవుతారని రామయ్య తేల్చిచెప్పారు. నిబంధనావళిని అతిక్రమించినందుకు జగన్ పై, ఇతర అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ ను కలవడం జరిగిందన్నారు.

మద్యం, డబ్బు పంచితే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమైనదని, అదొక తప్పుడు ఆర్డినెన్స్ అని, ప్రతిపక్ష పార్టీ సభ్యులను భయపెట్టి దారికి తెచ్చేందుకు, ప్రభుత్వం దానిని అస్త్రంగా వాడుకుంటోందని వర్ల దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగేవరకు, ఈ 22రోజుల పాలు రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసేస్తే ఏ గొడవ ఉండదని, అటువంటి పనిచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ పనిచేయకుండా చట్టం ముసుగులో, గిట్టనివారిపై కక్ష తీర్చుకోవాలని చూడటం ఎంతవరకు భావ్యమని రామయ్య నిలదీశారు. గెలిచినవాడి పదవినికూడా, ముందు సరఫరా చేశాడనో.. డబ్బు పంచాడనో సాకులుచూపి, ఊడపీకేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉపయోగపడుతుందన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఎన్నికలు ముగిసేవరకు మందుసీసా అనేది కనపడకుండా చేయాలని, మద్యం దుకాణాలన్నీ మూసేయాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిని కోరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నిఘా యాప్ ను ఆవిష్కరించిన విషయం తనకు తెలుసునని, ఎన్నికల కార్యదర్శి కూడా చెప్పారన్నారు. మద్యం దుకాణాలు మూసేసినంత మాత్రాన ఎవరూ నష్టపోయేది లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వర్ల తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read