రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్​కుమార్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నేతలు ఓట్ల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన వెయ్యి రూపాయల నగదు, నిత్యావసరాలను వాలంటీర్లతో పంపిణీ చేయించకుండా... వైకాపా అభ్యర్థులతో ఇప్పిస్తున్నారని ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన ఆధారాలంటూ దాదాపు 250కి పైగా సంఘటనల వీడియోలు, ఫొటోలను లేఖకు జతచేశారు. స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎన్నికల సంఘం బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇది ఆయన రాసిన లేఖ "కోవిడ్ 19వైరస్ ఉధృతి నేపథ్యంలో మనదేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం మీకు విదితమే. అటు రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో, ఇటు లాక్ డౌన్ కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లాగానే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా అల్లాడుతోంది. పేద కుటుంబాలకు రేషన్ తోపాటు రూ 1,000ఆర్ధిక సాయం అందించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమంచిన పెయిడ్ వాలంటీర్ల ద్వారా రూ 1,000 నగదును, రేషన్ తోపాటు ఇంటింటికి పంపిణీ చేస్తారని ప్రకటించింది. అయితే సదరు గ్రామ వాలంటీర్ల విధుల నిర్వహణకు బదులుగా, ఇటీవల వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధులే, స్థానిక వైసిపి నాయకులతో కలిసి ఇంటింటికి నగదు పంపిణీ చేస్తూ నిస్సిగ్గుగా తమకు ఓట్లు వేయాలని కోరుతున్నారు."

"కరోనా మహమ్మారిపై యావత్ ప్రపంచం తమ శక్తినంతటినీ వినియోగించి, ఎంతో శ్రద్దతో ఒకవైపు పోరాటం చేస్తుంటే, మనరాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలపైనే పూర్తిగా నిమగ్నం అయ్యారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలపై కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి నాయకులు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. శరవేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్నిరకాల సామాజిక మరియు రాజకీయ సమావేశాలను కేంద్రప్రభుత్వం నిషేధించింది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇంటింటికి రేషన్, నగదు పంపిణీ ముసుగులో పార్టీ కండువాలు ధరించి, జెండాలు ప్రదర్శిస్తూ, వైసిపి ప్రచారం చేస్తూ గుంపులుగా తిరుగుతున్నారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో జనాన్ని పోగేసుకుని గుంపులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఈ రకమైన ప్రచార ప్రదర్శనల వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదమే కాకుండా ప్రాణాలకే పెనుముప్పుగా పరిణమిస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంపైనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా నిమగ్నం అయ్యారని దీనిని బట్టే తెలుస్తోంది. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేటప్పుడే, మళ్లీ తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఏవిధమైన ఎన్నికల ప్రచారాలు చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. "

"ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్ధుల ప్రచారం చేస్తున్న సందర్భాలు రాష్ట్రంలోని 175అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొల్లలుగా ఉన్నాయి. వీటిపై సాక్ష్యాధారాలతో సహా, దాదాపు 253 ప్రాంతాల్లోని స్థానిక ప్రజలే ఎక్కడికక్కడ రికార్డింగ్ చేసిన వీడియోలు తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్నాయి. వాటన్నింటినీ తదుపరి చర్యల నిమిత్తం మీకు అందజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఆర్డినెన్స్ నెంబర్ 2ను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్ధి అయినా డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తే, సదరు అభ్యర్ధిని పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా, శిక్ష కూడా విధించాలని ఆ ఆర్డినెన్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చేవరకు ఎన్నికల ప్రచారం చేయరాదన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంఘించడమే కాకుండా, ఈ ప్రక్రియ ద్వారా ఓట్ల కొనుగోళ్లకు ప్రభుత్వధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒకవైపు గుంపులుగా ప్రచారం చేస్తూ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 51- 60 సెక్షన్లను ఉల్లంఘించారు. అంతే కాకుండా వైసిపి నాయకుల ఈ విధమైన ప్రచారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 171(ఇ), 171(ఎఫ్),188 సెక్షన్ల కింద కూడా శిక్షార్హమైనవి. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలను ఇంత ఘోరంగా, నిస్సిగ్గుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంఘించడం ప్రజాస్వామ్య విలువలకు, నిబంధనలకు మాయనిమచ్చ. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఈ మూకుమ్మడి ఉల్లంఘనలపై విచారణ జరిపి దోషులపై సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను, నిబంధనలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం." అంటూ చంద్రబాబు లేఖ రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read