రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటుకు రంగం సిద్ధం అయ్యింది. ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ ఫైలు రెడీ చేసింది. గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ఫైలును పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ అమలులోకి వస్తే రమేష్ కుమార్ ని తొలగించే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమంటున్న న్యాయనిపుణులు అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకల పై రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి రమేష్ లేఖ రాసారు. తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో రమేష్ కుమార్ ఆందోళనవ్యక్తం చేసారు. రమేష్ కుమార్ ముక్కు సూటితనం పై ఇటీవలే జగన్ భగ్గుమన్నారు. రమేష్ పై రాజకీయ, కుల విమర్శలకు దిగిన మంత్రులు, వైసీపీ నేతలు.
కరోన సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మరోసారి రుజువైందంటూ విపక్ష నేతల విమర్శలు చేస్తున్నారు. శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఈ విషయం పై మండి పడ్డారు. "రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి(ఎస్ ఈసి) పదవీకాలం 5ఏళ్లనుంచి 3ఏళ్లకు తగ్గిస్తూ ప్రతిపాదించిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం. రాజ్యాంగ విరుద్దమైన ఈ ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్ ఆమోదించరాదు. అధికారులను బెదిరించి, వ్యవస్థలను ధ్వంసం చేసి రాజ్యం చేయాలన్న దుష్టతలంపుతోనే వైసిపి ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ లో టెర్రరిస్ట్ పాలన సాగుతోంది. అందుకు తాజా ఉదాహరణే ఈ ఆర్డినెన్స్ ఎన్నికల కమిషనర్ నే తీసేస్తామని బెదిరించే పరిస్థితి వస్తే ఇక స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా జరుగుతాయి..? పారదర్శక స్వేచ్చాయుత ఎన్నికలే జరగకపోతే, ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏం ఉంటుంది..? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసిపి ప్రభుత్వం ఖూనీ చేస్తోంది. గవర్నమెంట్ టెర్రరిజానికి ఈ ఆర్డినెన్స్ తాజా రుజువు."
"రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) ప్రకారం ఎస్ ఈసిని గవర్నర్ నియమిస్తారు. ఒకసారి నియమించాక, పదవీకాలం 5ఏళ్లని నిర్ణయించాక, ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికీ లేదు. హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ ఈసి తొలగింపునకు వర్తిస్తుంది. వీళ్లకు లేని అధికారాన్ని చలాయించి ఎస్ ఈసి పదవీకాలం తగ్గించాలని చూడటం హేయం. 3ఏళ్లకు పదవీకాలం కుదించడం అంటే ఎలక్షన్ కమిషనర్ ను తొలగించడమే. వీళ్లకు అధికారం లేని అంశంపై ఆర్డినెన్స్ ఎలా ఇస్తారు..? ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారు..? స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి అధికారాలు, నిధుల గురించి 73,74వ రాజ్యాంగ సవరణల్లో స్పష్టంగా చెప్పారు. వైసిపి ప్రభుత్వ చర్యలు 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. ఎన్నికల స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోయేలా వైసిపి ప్రభుత్వం చేస్తోంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 243(కె), ఏపి పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200 రెండింటి సారాంశం ఒక్కటే. 73,74 రాజ్యాంగ సవరణల అనుగుణంగానే ఎవరైనా వ్యవహరించాలి. ఈసి నియామకం, పదవీకాలం గురించి రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. పంచాయితీరాజ్ చట్టానికి ఏ సవరణలు చేసినా రాజ్యాంగ పరిధిలోనే జరగాలి. వైసిపి ప్రభుత్వ ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం. 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. కాబట్టి ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకూడదు." అని అన్నారు.