జపాన్ పరిశ్రమల కోసం ప్రత్యేక సింగిల్ డెస్క్ విధానాన్ని తీసుకురానున్నట్టు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. శ్రీసిటీలోని జపాన్ కు చెందిన ప్రముఖ టోరే ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ శుక్రవారం ఉదయం రాష్ట్ర పరిశ్రమల, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామన్నారు. ఈ పాలసీలో నైపుణ్య శిక్షణాభివృద్ధికి పెద్ద పీట వేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిపార్లమెంటరీ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, దానికి అనుబంధంగా పలు కళాశాలలను ప్రారంభించడం ద్వారా నాణ్యమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా ఆసక్తిగా వుందన్నారు. శ్రీ సిటీ యాజమాన్యం కోరిక మేరకు శ్రీ సిటీ నుంచే ఈ పాలసీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
1000 కోట్లుతో ఏర్పాటైన టోరె పరిశ్రమ, రాష్ట్రంలో పారిశ్రామిక స్థిరత్వాన్ని సూచిస్తోందన్నారు. ఇంజనీరింగ్ ప్యాబ్రిక్స్, టెక్స్ టైల్స్ తయారు చేసే ఈ తరహా పరిశ్రమ దేశంలోనే ఇదే మొదటిదని ఆయన తెలిపారు. స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వలన పలు జపనీస్ కంపెనీలు ఆంధ్రప్రదేశకు, ప్రత్యేకించి శ్రీసిటీకి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. తమ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం పట్ల టోరే యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు. 29 దేశాలకు చెందిన 187 పరిశ్రమలతో 50 వేలకు పైగా ఉపాధి కల్పించి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
అయితే ఇది ఇలా ఉంటే, టోరే కంపెనీ, చంద్రబాబు హయంలో వచ్చింది. అప్పట్లోనే ఒప్పందం చేసుకుని, భూమి ఇచ్చి, భూమి పూజ చేసి, కంపెనీ నిర్మాణం ప్రారంభించారు. ఈ కంపెనీని జగన్ తెచ్చినట్టు, వైసీపీ చెప్పటం పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జరగాలి పెళ్లి... మళ్ళీ మళ్ళీ.. అనే వ్యంగ్య సామెతనుజగన్ను చూసే పెట్టారేమో అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. కియా మోటార్స్ విషయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బుర్రకథ వినిపించారని.. అలాగే తెదేపా హయాంలో వచ్చిన టీసీఎల్ని తమ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. తాజాగా 'టోరే' వంతు వచ్చిందన్న లోకేశ్.. ఈ కంపెనీని ఎంతో కష్టపడి చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెదేపా హయాంలో 'టోరే' కంపెనీ రాష్ట్రంలో భూమిపూజ చేసిందని... భవనాలూ సిద్ధం అయిపోయన కంపెనీని తామే తెచ్చినట్లు వైకాపా ప్రభుత్వం హడావిడి చేస్తోందన్నారు. కియా మోటార్స్‌ను బెదిరించినట్లు టోరేను కూడా బెదరగొట్టి ఏపీ నుంచి తరిమివేయొద్దని కోరారు.