ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెలెక్ట్ కమిటీ విషయం, రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు ముక్కల రాజధాని విషయంలో, రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి, శాసనమండలికి పంపటం, అక్కడ తెలుగుదేశం పార్టీ సీఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లులను, సెలెక్ట్ కమిటీకి పంపాలని ఒత్తిడి చెయ్యటం, మండలిలో టిడిపితో పాటు, ఇతర విపక్షాలకు బలం ఉండటంతో, ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ, మండలి చైర్మెన్ నిర్ణయం తేసుకున్నారు. సెలెక్ట్ కమిటీ పేర్లు ఇవ్వాలి అంటూ, పార్టీలకు లేఖలు రాసారు. పార్టీలు ఇచ్చిన పేర్లతో, సెలెక్ట్ కమిటీని నియమించి, ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ, మండలి సెక్రటరీని, చైర్మెన్ ఆదేశించారు. అయితే, ఎప్పుడూ లేని విధంగా, ఏకంగా మండలి చైర్మెన్ నిర్ణయానికే, ఎదురు చెప్పారు, మండలి సెక్రటరీ. సెలెక్ట్ కమిటీని నియమించమంటూ, మండలి చైర్మెన్ పంపించిన ఫైల్ ను, మండలి సెక్రటరీకి వెనక్కు పంపి, సంచలనానికి తెర లేపారు.
మండలి సెక్రటరీని, ప్రభుత్వం బెదిరించి, మండలి చైర్మెన్ కు వ్యతిరేకంగా ప్రవర్తించింది అంటూ, ప్రభుత్వం పై ఆరోపణలు చేసింది టిడిపి. అయితే మండలి చైర్మెన్ ఫైల్ ని తిరిగి పంపటంతో, ఆ ఫైల్ పై, నోట్ రాసి, మళ్ళీ మండలి సెక్రటరీకి, ఆ ఫైల్ పంపించారు చైర్మెన్. తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, 48 గంటల లోగా, తన ఆదేశాలు పాటిస్తూ, సెలెక్ట్ కమిటీ నియమించాలని, ఆదేశాలు జారీ చేసారు. అయితే, ఇప్పుడు 48 గంటలు అవ్వటంతో, సెలెక్ట్ కమిటీకి తాను నోటిఫికేషన్ ఇవ్వలేనని కార్యదర్శి ఫైలును, మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేశారు సెక్రటరీ. అయితే, ఇప్పుడు రెండో సారి కూడా, తన ఆదేశాలు దిక్కరించటంతో, మండలి చైర్మెన్ ఎలాంటి నిర్నయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది.
చైర్మెన్ తనకు ఉన్న అధికారాలు ఉపయోగించి, సెక్రటరీ పై చర్యలు తీసుకుంటారా, లేక కోర్ట్ కు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. ఇది రాజ్యాంగ సంక్షోభానికి కూడా దారి తీసే అవకాసం ఉందని అంటున్నారు. ఏ సభలో అయినా, అక్కడ చైర్మెన్ కాని, స్పీకర్ కాని తీసుకునే నిర్ణయాల్లో, కోర్ట్ లు కూడా జోక్యం చేసుకోవని, ఇక ప్రభుత్వం ఎంత అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో పక్క మండలి సెక్రటరీ పై, సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అంటుంది. ఇక మరో పక్క, ఇప్పటికే అసెంబ్లీ, కౌన్సిల్ ని ప్రోరోగ్ చేపించిన ప్రభుత్వం, ఈ రెండు బిల్లుల పై, ఆర్డినెన్స్ తీసుకు వచ్చే అవకాసం ఉందని, దీని పై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం వస్తుంది.