గత మూడు నాలుగు రోజులుగా, వైసీపీ పార్టీ, ఎన్డీఏలో చేరుతుందని, చేరగానే, వారికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి అంటూ, ప్రచారం జరిగింది. వైసీపీకి రెండు నుంచి మూడు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని, విజయసాయిరెడ్డికి నౌకాయానశాఖను ఇస్తారని, మరొకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి వస్తుంది అనే వార్తలు వచ్చాయి. ఈ విషయం పైనే, జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ వెళ్ళారని, మూడు రోజుల వ్యవధిలో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం వెనుక, కారణం ఇదే అని, అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో, ఈ విషయం పై చర్చలు జరిపారనే, వార్తలు వచ్చాయి. నిన్న ఇదే విషయం పై బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం కోసం ఎవరితో అయినా కలుస్తామని, రాష్ట్రానికి మంచిది అనుకుంటే, కేంద్ర మంత్రి పదవి తీసుకుంటాం అని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై ఇప్పటికే, గోల జరగటంతో, నేను అలా అనలేదు అంటూ ఈ రోజు బొత్సా మరో ప్రకటన విడుదల చేసారు. మొత్తంగా, వైసీపీ, కేంద్రం మంత్రి వర్గంలో చేరుతుంది అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు.
అయితే ఇదే విషయం పై, బీజేపీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్, ఈ ప్రచారం పై స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. తమకు ఆంధ్రప్రదేశ్ లో కేవలం జనసేనతో పొత్తు ఉందని, తెలుగుదేశం పార్టీతో కాని, వైసీపీ పార్టీతో కాని, ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పారు. వైసీపీ పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ప్రచారం మాత్రమే అని సునీల్ దేవధర్ తేల్చి చెప్పారు. ఈ విషయం పై, గత రెండు రోజులుగా అనేక, చర్చలు జరిగిన విషయం తమకు తెలుసని, ఇవన్నీ తప్పుడు వార్తలని, వైసీపీ, కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకామే లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, తమకు వైసీపీ, రాజకీయ ప్రత్యర్థులే తప్ప మరొకటి కాదని, సునీల్ దేవధర్ స్పష్టం చేసారు.
"జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను కలిసిన తరువాత, వైసీపీ పార్టీ ఎన్డీయేలో చేరి, కేంద్ర మంత్రి పదవులు చేపడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పై నేను మీకో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దీని కోసం వీలు అయినంత సహాయం చెయ్యాలని మోడీ సారధ్యంలోని కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, వేరే పార్టీ ఉన్నా, రాష్ట్రాలకు సహాయం చెయ్యటంలో, కేంద్రం వైఖరిలో మార్పు ఉండదు. మాకు అన్ని రాష్ట్రాలు ఒక్కటే, అన్ని రాష్ట్రాలను సమాన దృష్టిలో చూస్తాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చే సరికి, మేము జనసేన పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నాము. ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీతో కాని, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కాని, మాకు రాజకీయ ప్రత్యర్థులే" అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.