తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు, పి. అశోక్ బాబు, ఈ రోజు సాక్షి మీడియాకు బహిరంగ లేఖ రాసారు. ఆ ఉత్తరం యధాతధంగా.. "బహిరంగ లేఖ.. ఎడిటర్, జగతి పబ్లికేషన్స్ (సాక్షి డైలీ), హైదరాబాద్, విజయవాడ. గత రెండు రోజులుగా మీ సాక్షి పేపర్లో వార్తలు చదివిన తరువాత, పత్రికా రంగం యొక్క దిగజారుడుతనాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాను. ఫిబ్రవరి 6వ తేదిన ఆదాయ పన్ను శాఖ తనిఖీలపై 13.02.2020 వ తేదిన కమిషనర్ ఇన్కమ్ ట్యా క్స్ ఒక పత్రికా ప్రకటన చేయటం జరిగింది. అందులో స్పష్టంగా దేశ వ్యాప్తంగా 40 చోట్ల, 6నగరాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. పేరా 2లో చాలా స్పష్టంగా 3 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల యొక్క కాంట్రాక్టు పనులలో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ప్రధానంగా ప్రకటన చేశారు. ప్రకటనలో స్పష్టంగా 4వ పేరాలో 2 వేల కోట్ల రూపాయలు ఈ మూడు కంపెనీల యొక్క లావాదేవీలలో చట్ట విరుద్దంగా జరిగినవని ప్రాధమికంగా ఆదాయ పన్ను శాఖవారు నిర్ధారించారు. అదే పేరాలో పన్ను ఎగవేసేందుకు, ఆ కంపెనీలే సబ్ కాంట్రాక్టులు సృష్టించి దాన్ని 2 కోట్ల రూపాయలకంటే తక్కువగా ఉన్నట్లుగా చూపించారని ప్రకటించారు. అలా సృష్టించిన కంపెనీలలో కొన్ని కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి చట్టవిరుద్ధంగా వచ్చాయని తెలిపారు. ఆఖరి పేరాలో ఈ మొత్తం తనిఖీలలో 85 లక్షల రూపాయలు నగదు మరియు 71 లక్షల రూపాయల ఆభరణాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు."
"3వ పేరాలో తనిఖీలు ఒక ప్రముఖ వ్యక్తి యొక్క వ్యక్తిగత కార్యదర్శి మరియు ఆ వ్యక్తి యొక్క సన్నిహితులపై కూడా తనిఖీలు చేసినట్లు, కొన్ని ఆధారాలు సీజ్ చేసినట్లు తెలిపారు. పై ప్రకటనల్లో 3వ పేరాలో తెలిపిన విషయాలు కేవలం సమాచారం నిమిత్తం తెలిపారే తప్ప ఎక్కడా పైన తెలిపిన 3 ఇన్ ఫ్రా కంపెనీలతో 3వ పేరాలోని వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు చెప్పలేదు. కానీ ఫిబ్రవరి 14 మరియు 15 తేదిలలో సాక్షి పేపర్లో మీరు ప్రచురించిన అవాస్తవాలు విస్మయానికి గురిచేశాయి. 3వ పేరాలో చెప్పిన వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి అఫిషియల్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ పి. శ్రీనివాసరావు మరియు శ్రీ కె. రాజేష్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ బాధ్యులు. ఆదాయ పన్ను శాఖ పత్రికా ప్రకటనలో ఎవరి పేర్లు చెప్పనప్పటికి వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని పై పేర్లను మేము కూడా ధృవీకరించడం జరిగింది."
"కానీ మీరు మీ పత్రికలో ఆదాయ పన్ను శాఖ వారు ప్రకటించిన 2 వేల కోట్ల రూపాయల చట్ట విరుద్ధ లావాదేవీలన్నీ వీరే చేశారని ప్రముఖంగా బ్యానర్ ఐటమ్ గా ప్రచురించటం చట్ట విరుద్ధం, దుర్మార్గం. రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నప్పటికి పత్రికలు వాస్తవాలు చెప్పాల్సిన నైతిక బాధ్యతను మీరు మరచిపోయి విషప్రచారం చేయటం చట్ట విరుద్ధం. 3వ పేరాలోని పేర్లు చెప్పనప్పటికి మీరు పేర్లు ప్రచురించటం జరిగింది. మరి 3 వ పేరాలోని వ్యక్తుల పేర్లు తెలిసినప్పుడు 3 ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీల పేర్లు మీకు తెలియదా? లేదా వాటిని ప్రచురించే ధైర్యం మీకు లేదా? మీకు తెలియకపోతే ఆదాయ పన్ను శాఖ వారిని అడిగి ప్రచురించవచ్చు. కానీ అది చేయకుండా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీపై బురదజల్లే ప్రయత్నం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. 3వ పేరాలోని వ్యక్తులపై జరిగిన సోదాలపై పంచనామా నివేదికలు మా వద్ద ఉన్నాయి. వాటిని ప్రకటించే ధైర్యం మీకు ఉందా? ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి. లేదంటే మీరు ప్రచురించింది తప్పుడు వార్తలుగా అంగీకరించి క్షమాపణ కోరి వివరణ ఇవ్వాలి. అట్లు కాని యెడల తప్పుడు వార్తలు ప్రచురించినందుకు మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము." అంటూ అశోక్ బాబు, ఆ ఉత్తరంలో రాసారు. మరి సాక్షి దీనికి స్పందిస్తుందో లేదో చూడాలి.