జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, నిధుల కోసం కటకటలాడుతుంది. ఇప్పటికే ఆదాయం పూర్తిగా తగ్గిపోయి, అప్పుల మీద నెట్టుకు వస్తున్న జగన్ ప్రభుత్వం, కేంద్రం సహయం కోసం కూడా ఎదురు చూస్తుంది. ఈ క్రమంలోనే, కేంద్రం ప్రభుత్వం గత ఏడాది, రైతుల కోసం ప్రవేశపెట్టిన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద ఇస్తున్న డబ్బులు ఒకే విడతలో ఇవ్వాలి అంటూ, జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ పధకం కింద, కేంద్రం, రూ.2వేల చొప్పున, మూడు విడతలుగా ఆరు వేలు ఇస్తుంది. దేశం అంతటా ఈ పధకం అమలులో ఉంది. అయితే, మూడు విడతలుగా కాకుండా, మా రాష్ట్రానికి మాత్రం ఒకేసారి ఆరు వేలు ఇవ్వాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పధకం, కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా అమలు చేస్తుందని, దేశం అంతటా ఒకే విధానం ఉంటుంది కాని, మీ కోసం ప్రత్యేకంగా చూడలేము అంటూ, మంగళవారం పార్లమెంట్ లో కేంద్రం ప్రకటించింది.
నిన్న పార్లమెంట్ లో ఈ విషయం పై చర్చకు వచ్చిన సందర్భంలో, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి కాకుండా, రాష్ట్ర ఆర్ధిక శాఖ నుంచి వెళ్ళటం గమనార్హం. జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఉండగా, ప్రతి ఒక్క రైతుకు, రైతుభరోసా పథకం ఇస్తాం అని, దీని కోసం, రూ.12,500 ప్రతి ఏడాది ఇస్తామని ప్రకటించారు. రైతులు కూడా, కేంద్రం ఇచ్చే ఆరు వేలు, జగన్ ఇచ్చే, రూ.12,500తో, మొత్తం 18,500 వస్తాయని ఆశ పడి, జగన్ ను గెలిపించారు. అయితే జగన్ అధికారంలోకి రాగానే, ప్లేట్ మార్చేసారు. ఈ పధకాన్ని, కేంద్రం ఇస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకంతో లింక్ పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 7500 రూపాయలు, కేంద్రం ఇచ్చే 6 వేలు కలిపి, మూడు విడతలుగా, 13500 ఇస్తున్నాం అని ప్రకటించారు. అయితే, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ డబ్బులు మూడు విడతలుగా ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తూ, కేంద్రాన్ని మాత్రం, ఒకేసారి ఇవ్వమని కోరటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. నిధుల కోసం, కటకటలాడుతున్న ప్రభుత్వానికి, వెసులుబాటు కోసం, ఇలా అడిగి ఉంటారని అంటున్నారు. కాని, కేంద్రం మాత్రం, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఇవ్వలేమని, అందరికీ మూడు విడతలుగా ఎలా ఇస్తున్నామో, అలాగే ఇస్తామని చెప్పింది. మరో పక్క, ఈ పధకంలో లబ్దిదారులను కూడా ప్రభుత్వం కుదించింది అనే వాదన వినపడుతుంది. ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో, ప్రభుత్వం అనేక నిబంధనలతో, వారికి సహాయం చెయ్యలేదు అనే విమర్శలు వచ్చాయి.