ప్రజా రాజధానిని నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతోనే వైసీపీ సర్కారు పనిచేస్తోందని, మూడుముక్కల ప్రకటనతో, ప్రజలను అయోమయంలో పడేసిన జగన్, తన స్వార్థంకోసమే విశాఖను రాజధానిగా ఎంచుకున్నాడు తప్ప, అక్కడేదో అభివృద్ధి చేసి, ఆ ప్రాంతవాసుల్ని ఉద్ధరించాలన్న ఆలోచన ఆయనకు లేనేలేదని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక, శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని, ప్రజామోదంతోనే నాటి టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందని, ఆ క్రమంలోనే దాని నిర్మాణంకోసం రైతులు 34 వేల ఎకరాలవరకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. నాడుప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా, అమరావతి ఎంపికను స్వాగతించాడని, అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30వేల ఎకరాల వరకు అవసరమవుతుందని కూడా చెప్పాడన్నారు. అమరావతి ప్రకటన తర్వాత సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ నుతయారు చేసి ఇచ్చిందన్నారు. ప్రజలుకూడా భాగస్వాములుగా మారి, నా ఇటుక – నా అమరావతి కోసం రూ55కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వంకూడా నవనగరాల నిర్మాణమే ప్రాతిపదికగా ముందుకుసాగిందని కొల్లు వివరించారు. రూ.9116కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లు, ఇతరేతర మౌలిక వసతులు పూర్తి చేయడం జరిగిందన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిపై ఒక్కరూపాయికూడా ఖర్చు పెట్టకపోగా, అమరావతిపై విషప్రచారం చేయడమేపనిగా పెట్టుకుందని రవీంద్ర దుయ్యబట్టారు. జగన్ మూడురాజధానులు ప్రకటనచేయడానికి ముందే, అమరావతి ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు పనికిరాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అని పలురకాలుగా దుష్ప్రచారం చేసిందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, చెన్నై ఐఐటీ నివేదికలతో, కేంద్ర ప్రభుత్వ ప్రకటనలతో అమరావతిపై వైసీపీప్రభుత్వం చేసిందంతా తప్పుడు ప్రచారమని తేలిపోయిందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ వల్లే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప, రాజధాని వికేంద్రీకరణ వల్ల కాదని రవీంద్ర తేల్చిచెప్పారు. విశాఖను, ఉత్తరాంధ్రను అంతగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన జగన్ కు ఉంటే, ఆ ప్రాంతంలో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలను ఎందుకు వెళ్లగొట్టాడో సమాధానం చెప్పాలన్నారు.
విశాఖలో ఏర్పాటు కావాల్సిన లులూ, ఆదానీ గ్రూప్ పరిశ్రమలను ఎందుకు తన్ని తరిమేశాడో స్పష్టంచేయాలన్నారు. విశాఖనగరం సహా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల స్వాహాకు, కబ్జాకే జగన్, అక్కడ రాజధాని అంటూ కొత్త పల్లవి మొదలెట్టాడన్నారు. ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్న జగన్మోహన్ రెడ్డి, కావాలనే తన స్వార్థంకోసం అమరావతిని బలిపెట్టడానికి సిద్ధమయ్యాడని రవీంద్ర తేల్చిచెప్పారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై జాతీయ, అంతర్జాతీయ మీడియాకూడా దుమ్మెత్తిపోసింద ని, తుగ్లక్ నిర్ణయమంటూ తూర్పారబట్టినా కూడా, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకెళుతున్నాడన్నారు. జగన్ దుష్ట ఆలోచనలపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, జాతీయ, అంతర్జాతీయ మీడియాకూడా తప్పుపడుతున్నా ప్రభుత్వ ఆలోచనలు మారకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ తీసుకున్న మూడురాజధానుల నిర్ణయంపై ప్రజాచైతన్య యాత్రలో ప్రజాభిప్రాయం కోరాలని టీడీపీ నిర్ణయించిందని, అందులోభాగంగానే రేపటినుంచి జరగబోయే యాత్రలో ప్రజాభీష్టమేమిటో తెలుసుకుంటామని రవీంద్ర వివరించారు. రేపటినుంచి మూడు రోజులపాటు ప్రజాబ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తామని, జగన్ అమరావతి కేంద్రంగా చేస్తున్న అల్లరిని రాష్ట్రప్రజలకు తెలియచేస్తామని ఆయన స్పష్టంచేశారు.
3 రాజధానుల పేరుతో అమరావతిపై కులముద్రవేసిన జగన్, తన భూదోపిడీకోసమే విశాఖను రాజధానిగా ఎంచుకున్నాడని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గతంలో అమరావతికి మద్ధతిచ్చిన జగన్, ఇప్పుడెందుకు అదేప్రాంతంపై విషప్రచారం చేస్తున్నడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించినజగన్, అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాన్ని ఎలా మార్చుకుంటాడన్నారు. చంద్రబాబు రాజధానిని ప్రకటిస్తే, నాటి ప్రతిపక్షనేత జగన్ దాన్ని స్వాగతించాడని, అనంతరం ప్రధాని మోదీ అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేశాడన్నారు. ఈవిధంగా కేంద్రప్రభుత్వం, నాటి అధికార, ప్రతిపక్షాలు అమరావతి ఎంపిక, నిర్మాణంలో కీలకపాత్ర పోషించాయని శ్రావణ్ కుమార్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన జగన్, అమరావతిపై తన అక్కసు వెళ్లగక్కుతుంటే, కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. కేంద్రం ఇప్పటికైనా జగన్ నిర్ణయంపై తన అభిప్రాయమేమిటో స్పష్టంగా చెప్పాలన్నారు. అమరావతిలో ఉన్న 132 సంస్థలను తరిమేయడానికి సిద్ధమైన జగన్, విశాఖను అభివృద్ధి చేస్తానంటే ప్రజలెవరూ నమ్మే స్థితిలోలేరన్నారు. అనేక రకాల పథకాలపేరుతో ప్రజలను ఇప్పటికే మోసగించిన జగన్, ఇళ్లస్థలాల పేరుతో మరోవిధంగా మోసంచేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.