తెలుగుదేశం పార్టీ పై, వైసీపీ తప్పుడు ప్రచారం కొనసాగుతూనే ఉంది. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా, ఒక్క ఆధారం కూడా బయట పెట్టకుండా, కేవలం బురద చల్లి, రాజకీయం చేసి, సొంత మీడియా ఛానల్స్ లో, ఈ మధ్య కొత్తగా చేతులు మారిన కొన్ని మీడియా చానల్స్ పెట్టుకుని, టిడిపి పై బురద చల్లుతూనే ఉన్నారు. మొన్నటి దాకా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. సిఐడి కేసులు అన్నారు. అదిగో ఇదిగో అన్నారు. అది ఏమైందో తెలియదు. పది రోజుల క్రిందట, చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయని, అవన్నీ చంద్రబాబు డబ్బులు అంటూ తప్పుడు ప్రచారం చేసారు. తరువాత పంచనామాలో అక్కడ 2 లక్షలు మాత్రమే ఉన్నాయని, అది కూడా వారికి తిరిగి ఇచ్చేసినట్టు ఉంది. దీంతో, ఈ ఆరోపణ కూడా తప్పుడు ఆరోపణ అని తేలిపోయింది. ఇప్పుడు మరో ఆరోపణతో, బురద చల్లే ప్రయత్నం మొదలు పెట్టారు.అసెంబ్లీ లోపల, బయట వైసిపి పై విరుచుకుపడుతున్న ఫైర్ బ్రాండ్, ప్రముఖ బీసీ నేత అయిన, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని టార్గెట్ చేసారు.
అచ్చెన్నాయుడు, అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. 151 మందికి ధీటుగా సమాధనం ఇస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ఉండటంతో, ఇప్పుడు కక్ష సాధింపులో భాగంగా, అచ్చెన్నాయుడుని టార్గెట్ చేసింది వైసీపీ. అచ్చెన్నాయుడు కార్మిక శాఖా మంత్రిగా పని చేసిన సమయంలో, అయన మందుల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, లీకలు ఇచ్చారు. దానికి సంబంధించి, ఒక ఉత్తరం బయట పెట్టారు. విజిలెన్స్ విచారణలో ఇది బయట పడింది అని, టెండర్ విధానంలో కాకుండా, నామినేషన్ పద్దతిలో కంపెనీలకు కేటాయింపులు జరిపినట్లు, ఇది ఒక పెద్ద స్కాం అని, ఇది మొత్తం, 85 కోట్ల స్కాం అని, మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే కోణంలో వార్తా కధనాలు వండి వార్చుతున్నారు. అయితే తన పై జరుగుతున్న విష ప్రచారం పై, అచ్చెన్నాయుడు వెంటనే స్పందించారు. శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడు, ఒక వీడియో సందేశం రూపంలో, ఈ వార్తను ఖండించారు. తమ కుటుంబానికి, అవినీతి చేసి, డబ్బులు సంపాదించే కర్మ పట్టలేదని, అవసరం అయితే, నలుగురుని అడ్డుకుని, డబ్బులు తెచ్చుకుని బ్రతుకుతాం అని అన్నారు.
తాను ఈ వ్యవహారంలో అంతా నిబంధనలు ప్రకారమే చేసానని అన్నారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు, ఆనాడు, ఈ విషయంలో ముందుకు వెళ్ళామని అన్నారు. అన్ని రాష్ట్రాలను పిలిచిన ప్రధాని, ఈఎస్ఐలో, టెలీ హెల్త్ సర్వీసెస్ ను ప్రారంభించాలని కోరారని, తరువాత ఈ విషయం పై ప్రధాని కార్యాలయం నుంచి లేఖ వచ్చిందని, కేంద్రం నుంచి వచ్చిన లేఖ పై చర్చించి, ఎలా ముందుకు వెళ్ళాలి అని డిస్కస్ చెయ్యగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఈ విధానాన్ని అమలు చేసారని చెప్పటంతో, అదే విధంగా, మనం కూడా చేద్దామని చెప్పానని, అదే విషయం ఆ ఉత్తరంలో కూడా ఉందని ఆయన అన్నారు. తాను తాను మంత్రిగా ఉన్న కాలంలో ప్రతి కొనుగోలు టెండర్ల ద్వారా జరిగింది అని, ఏనాడు నామినేషన్ పద్దతిలో ఇవ్వాలని కోరలేదని అన్నారు. తన దగ్గర అన్ని నోట్ ఫైల్స్ ఉన్నాయని, తన మీద ఏ విచారణ కావాలంటే ఆ విచారణ వేసుకోవచ్చని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడు వివరణతో, ఈ విషయంలో కూడా పస లేదని, ఇది కూడా వైసీపీ చేస్తున్న మరో ప్రచారంగా మిగిలి పోతుందని, చెప్పటంలో సందేహం లేదు.