జనవరి 30న చంద్రబాబు లేఖకు చంద్రబాబుకు విదేశాంగమంత్రి జైశంకర్ రిప్లై ఇచ్చారు. చైనాలో కరోనా వ్యాధితో అల్లాడుతున్న వుహాన్ నగరంలో చిక్కుకున్న 58మంది ఇంజనీర్ల ఆరోగ్యంపై చంద్రబాబు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే. దానికి జవాబిస్తూ ప్యానల్ ఆప్టోడిస్ ప్లే టెక్నాలజి ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీర్ల తాజా స్థితిగతులపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వివరాలను తెలియజేశారు. మొత్తం 58ఇంజనీర్లలో 56మందిని వుహాన్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఫిబ్రవరి 1నే తరలించామని తెలిపారు. ఈ 56మంది ప్రస్తుతం ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇద్దరు ఇంజనీర్లు అన్నెం జ్యోతి, దొంతంశెట్టి సత్య సాయికృష్ణలకు సాధారణం కన్నా జ్వరం స్వల్ప తీవ్రత ఉండటంతో ఫిబ్రవరి 1న విమానంలో పంపేందుకు చైనా అధికారులు అనుమతించలేదు. ఈ ఇద్దరు చైనాలోని వుహాన్ హైటెక్ డెవలప్ మెంట్ జోన్, ఆప్టిక్స్ వ్యాలీ ఇండస్ట్రియల్ పార్క్ లో స్టార్ట్ ఆప్టోఎలక్ట్రానిక్స్ టెక్నాలజి కం లిమిటెడ్ లోనే ప్రస్తుతం ఉన్నారు.
బీజింగ్ లోని భారత ఎంబసి అధికారులు వారిద్దరితో, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ఆ ఇద్దరికి కావాల్సిన వైద్య చికిత్స, ఇతర అవసరాలలో అండగా ఉండాలని, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వుహాన్ లోని వైద్యాధికారులను భారత ఎంబసి అధికారులు అభ్యర్ధించారు. వారిద్దరి ఆరోగ్యానికి, చికిత్సకు సంబంధించిన సమాచారాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతుందని, కేంద్రమంత్రి జైశంకర్ ఆ లేఖలో పేర్కొన్నారు.