జగన్ మోహన్ రెడ్డికి ఒక పక్క మూడు రాజధానుల విషయంలో, అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ప్రకటన చేసిన తరువాత, ప్రజల్లో పెద్దగా రెస్పాన్స్ రాక పోగా, అమరావతిలో ఎదురు తిరిగారు. ఇక శాసనమండలిలో దెబ్బ, నిన్న హైకోర్ట్ లో దెబ్బతో జగన్ చికాకుగా ఉన్న సమయంలో, ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈడీ కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై, ఈ రోజు కీలక తీర్పు ఇవ్వనుంది కోర్ట్. ఈ కేసు పై ఈ నెల 10వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు ఏమి వస్తుంది అనే దాని పై అంతటా ఉత్కంట నెలకొంది. తీర్పు పై వైసీపీ వర్గాల్లో కూడా ఉత్కంట నెలకొంది. జగన్ కు, కోర్ట్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తుందా, లేదా హాజరు కావలసిందే అని కోర్ట్ చెప్తుందా అనే దాని పై, వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే, ఈడీ సిబిఐ కేసులను రెండూ కలిపి ఒకేసారి విచారిచాలన్న జగన్ పిటీషన్ ను ఇప్పటికే సిబిఐ కోర్ట్ కొట్టివేసింది. అందుకే ఈ రోజు తీర్పు ఎలా ఉంటుందో అనే దాని పై, టెన్షన్ పడుతున్నాయి వైసీపీ శ్రేణులు.
మరో పక్క ఈ నెల 3న తన అక్రమ ఆస్తుల కేసులో జగన్ ఆబ్సేంట్ పిటీషన్ వేసారు. దీని పై సిబిఐ కోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడాది మార్చ్ నుంచి ఒక్కసారి కూడా, ఒక్క శుక్రవారం కూడా విచారణకు రాలేదని, కేసు దర్యాప్తులో పురోగతి ఎలా ఉంటుందని కోర్ట్ ప్రశ్నించింది. తదుపరి వాయిదాకు కచ్చితంగా రావాల్సిందే అని చెప్పింది. దీంతో, ఈ నెల 10న, వ్యక్తిగతంగా విచారణకు జగన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో, ఇలా కేసుల్లో కోర్ట్ కు వెళ్ళటం, ఏపిలో మొదటి సారి. ఉమ్మడి ఏపిలో కూడా ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డితో కలిసి, జగన్ మోహన్ రెడ్డి, 10న కోర్ట్ కు హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు, ఆయన కోర్ట్ లోనే ఉన్నారు.
ఇక నుంచి తాను కోర్ట్ కి రాలేనని, తన స్థానంలో సహా నిందితుడు కోర్ట్ కు హాజరవుతారని, పిటీషన్ దాఖలు చేసారు. తన హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మరో రెండు పిటీషన్లు దాఖలు చేసారు. అన్ని చార్జ్ షీట్లు కలిపి విచారించాలని ఒకటి, ఈడీ, సిబిఐ కేసులు రెండూ కలిపి ఒకేసారి విచారించాలని. అయితే ఈ రెండు పిటీషన్లను కోర్ట్ గత వారం కొట్టేసింది. మరో వైపు ఈడీ కేసుల్లో, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, ఈ నెల 10న వేసిన పిటీషన్ పై, ఈ రోజు తీర్పు రానుంది. ఒక వేళ, తీర్పు జగన్ కు వ్యతిరేకంగా వస్తే, ఈడీ కేసులో కూడా, జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో, కోర్ట్ కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే, ముఖ్యమంత్రి హోదాలో, అక్రమ ఆస్తుల కేసులో, సిబిఐ కోర్ట్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే.