ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు అంశంలో మరోక కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార పక్షమైన వైకాపా అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించుకోగా, మండలిలో సెలెక్టు కమిటీకి పంపిస్తూ కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి శాసన మండలిని రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మండలి ఛైర్మన్ అకస్మాత్తుగా మంగళవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందతో భేటీ అయి,పలు కీలక అంశాలపై చర్చించటం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ భేటీ సరికొత్త ఊహాగానాలకు తెరతీసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. శాసన మండలి రద్దు చేసేందుకు ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహరించకుండా, నియమాలను ఉల్లంఘిస్తుందని చైర్మన్ షరీఫ్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ప్రభుత్వం కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే, రదైనట్లుగా వ్యవహరిస్తోందని తెలిపారు.
ఇదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై మండలిలో జరిగిన చర్చ అనంతర పరిణామాలలో తన విచక్షణాధికారాలతో సెలెక్టు కమిటీకి పంపిన విషయాన్ని గవర్నర్కు ఛైర్మన్ షరీఫ్ వివరించారు. ఈ అంశంలో ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు సెలెక్టు కమిటీ ఏర్పాటు కాకుండా తన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మనీ బిల్లులకు, సాధారణ బిల్లులకు వ్యత్యాసం ఉంటుందని ఈ రెండు బిల్లులు మనీ బిల్లులు కావన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి షరీఫ్ తెచ్చారు. మనీ బిల్లులకు వర్తించే నిబంధనలను ఈ బిల్లులకు సాకుగా చూపుతూ మండలి కార్యదర్శి వెనక్కి పంపటం జరిగిందని, ఇది పూర్తిగా సభా గౌరవాన్ని మంటగలపటమేనని చెప్పారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికి రెండుసార్లు తాను ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, అయితే మండలి కార్యదర్శి వీటిని వెనక్కి తిప్పి పంపారని గవర్నరు ఫిర్యాదు చేశారు.
మండలి కార్యదర్శితో పాటుగా, మరో అధికారి పై కూడా, మండలి చైర్మెన్, గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. తేదీలతో సహా వీళ్ళు చేసిన పనిని, సవివరంగా గవర్నర్ కు వివరించి, వారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి అంటూ, చైర్మెన్ కోరటం సంచలనంగా మారింది. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది, ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలన్నింటిని సానుకూలంగా విన్న తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మండలి ఛైర్మన్ షరీఫ్ అకస్మాత్తుగా గవర్నర్ బిశ్వభూషణ్ భేటీ కావటం రాజకీయ కాకను పెంచింది. ఇదే సమయంలో మండలి రద్దు అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీతోపాటు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా వ్యతిరేకిస్తుండటంతో భవిష్యత్ పరిణామాలు ఏవిధంగా ఉంటాయోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.