రాష్ట్రంలో నేతల భద్రత అంశం రగడగా మారింది. ఇటీవల విపక్ష పార్టీ అయిన తెలుగుదేశం నేతలకు భద్రత తొలగించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు భద్రత కుదింపుపై రోజుకొక పంచాయితీ కొనసాగుతుంది. అధికార, విపక్ష నేతల మధ్య ఈ అంశంలో మాటల తూటాలు పేలుతూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేట్ సెక్యురిటీ రివ్యూ కమిటీ ఇటీవల నిర్వహించిన సమీక్షలో టీడీపీ హాయాంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి భద్రత ఉపసంహరిస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది టీడీపీ నేతలకు పోలీసు శాఖ భద్రతను ఉపసంహరించుకుంది. దీనిపై విపక్ష పార్టీ అయిన తెలుగుదేశం తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుంది. తమను అంతమొందించడానికే వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిలో భాగంగానే భద్రత తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కేవలం రాజకీయ కక్షతో తమకు భద్రత తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘనా థరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులతో పాటు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పటికే భద్రతను తొలగించారు.
గడిచిన 20 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న తమకు భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను మాజీ మంత్రిదేవినేని ఉమా ప్రశ్నిస్తున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని నిలదీసున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతను ప్రభుత్వం కుదించడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం తిరిగి ఆయనకు భద్రతను పునరుద్దరించింది. మరోవైపు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భద్రతను రెండుసార్లు కుదిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. జెడ్ కేటగిరి భద్రతను కాస్త వై ప్లస్ కు దాని నుంచి సాధారణ భద్రతకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతంటీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్న నేపథ్యంలో ఆయన భద్రతతో పాటు నేతల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మారుమూల ప్రాంతాల్లో ప్రజలను కలిసేందుకు తాము పర్యటనలు చేయాల్సి ఉంటుందని ఇలాంటి సమయంలో ప్రభుత్వం భద్రత తొలగిస్తే తమకు రక్షణ ఎలా ఉంటుందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రికు న-క్స-లై-ట్లు, ఎర్రచందనం స్మ-గ్ల-ర్ల-తో ప్రాణహాని ఉందని ఆయన భద్రతను ఎలా కుదిస్తారని ప్రభుత్వాన్ని, పోలీసుశాఖను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. కేంద్రబలగాలభద్రత కలిగి ఉన్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత కల్పించాల్సి ఉంటుందని అలాంటిది కుదింపు ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వైకాపా హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏమా త్రం ప్రాణరక్షణ లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ప్రతి పక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలపై అధికారపక్షం నేతలు కూడా దీటుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతను కుదించలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేయడం కొసమెరుపు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతలో ఎటువంటి మార్పులు జరుగలేదని, ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ సెక్యురిటీలో భద్రత కల్పిస్తున్నామని ఏపీ డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.