ఉదయమే నిద్ర లేవటంతోనే, సోషల్ మీడియాలో ఒక ప్రముఖ వార్తా సంస్థ రాసిన ఆర్టికల్ చూసి, ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడింది. రాయిటర్స్, nasdaq.com లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, exclusive అంటూ కధనాలు రాసాయి అంటే, నమ్మకుండా ఉండలేని పరిస్థితి. ఈ వార్త నిజం కాకూడదు అని కోరుకోవటం తప్ప, చేసేది ఏమి లేని పరిస్థితి. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లోని, అనంతపురం జిల్లాలో, అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో, 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టి, ప్లాంట్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు, ఎంతో కష్టపడి, అనేక రాయతీలు ఇచ్చి, ఈ పరిశ్రమను, మన రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఎన్నో రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడినా, మన వద్దకు వచ్చి పెట్టుబడి పెట్టింది కియా. అయితే, ఈ రోజు రాయిటర్స్ రాసిన కధనం ప్రకారం, కియా మోటార్స్, మన రాష్ట్రం నుంచి తన ప్లాంట్ ను తరలించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇప్పటికే అమరావతిని మార్చేస్తున్నారు అనే వార్తతో రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థతిలో, ఇప్పుడు కియా కూడా వెళ్ళిపోతుంది అనే వార్త వింటుంటే, భయం వేస్తుంది. రాయిటర్స్ కధనం ప్రకారం, కియా మోటార్స్, తన 1.1 బిలియన్ డాలర్ల ప్లాంట్ ను, తమిళనాడుకి తరలిస్తున్నారు అని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ ప్రారంభం అయిన, కొన్ని నేలలుకే, కియా ఇలా ఆలోచించే పరిస్థితి వచ్చింది. గతంలో చంద్రబాబు హయంలో ఉన్న విధానాలకు, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న విధానాల కారణంగానే ఇలా ఆలోచిస్తున్నారని, ఆ కధనం సారంశం. మరీ ముఖ్యంగా గతంలో చంద్రబాబు ప్రకటించిన రాయతీలను, ఇప్పటి ప్రభుత్వం, మళ్ళీ సమీక్ష పేరుతొ, చేస్తున్న చర్యలతో, ఈ నిర్ణయం తీసుకునట్టు చెప్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వంతో, కియా చర్చలు జరిపిందని, వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో ఏవో ఇబ్బందులు ఉన్నాయి, అందుకే వారు మాతో ప్రధామిక చర్చలు జరిపారు, వచ్చే వారం కార్యదర్శి స్థాయి సమావేశం ఉంది, అప్పుడు మాకు మరింత స్పష్టత ఉండవచ్చు అని తమిళనాడుకు చెందిన ఒక ఆఫీసర్ చెప్పినట్టు రాయిటర్స్ రాసింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి, గౌతం రెడ్డి, కియాకు ఇచ్చే రాయతీలు, 20 వేల కోట్లు అవుతాయని, అంత అవసరమా అని చెప్పిన సందర్భం కూడా ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. మరో పక్క, కియా ప్రారంభోత్సవంలో, ఎంపీ మాధవ్ అక్కడ కియా అధికారులనే బెదిరించారని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా, ఇంత పెద్ద కంపెనీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ వార్త నిజం కాకూడదు అని కోరుకోవటం తప్ప, చేసేది ఏమి లేదు.