సాగునీటి రంగంపై స్పష్టతలేని రాష్ట్రప్రభుత్వం, రాయలసీమకు తీరని అన్యాయం చేసిందని, సీమకరవుకు శాశ్వతంగా విముక్తిచూపతానని గతంలో ప్రకటించి, ఇప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న జగన్‌ను రాయలసీమద్రోహిగా భావిస్తున్నామని టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మంగళగి రిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేరులతో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణసమయంలో ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి, మిగులుజలాల ఆధారిత ప్రాజెక్టులపై, రాష్ట్రంలోని కరవుప్రాంతాలకోసం నీటిహక్కులు కోరబోమని లిఖితపూర్వకంగా సమాధానం చెప్పడం జరిగిందన్నారు. ఆనాడు ఆయనతీసుకున్న నిర్ణయం అనేకసాగునీటిప్రాజెక్టులకు సమాధికట్టిందన్నారు. చంద్రబాబునాయుడు కలలుగన్న నదులఅనుసంధానాన్ని, జగన్‌ ఒక ప్రహసనంగా మార్చాడని, 2019 డిసెంబర్‌నాటికి పోలవరంనుంచి గ్రావిటీద్వారా నీళ్లు తేవాలని చంద్రబాబు అనుకుంటే, వైసీపీప్రభుత్వం వచ్చాక పోలవరాన్ని నిలిపివేసిందన్నారు. 2020 డిసెంబర్‌నాటికి కూడా పోలవరం నీళ్లువస్తాయో, రావోనన్న సందేహం అందరిలోనూ ఉందన్నారు. గోదావరి నీళ్లను ఏపీ భూభాగంలోనుంచే బొల్లాపల్లికి తరలించి, అక్కడ్నుంచి పెన్నానదికి పంపాలని గతప్రభుత్వం భావిస్తే, జగన్‌సర్కారు అదేప్రాజెక్టును తెలంగాణకు మేలుచేసే విధంగా మార్పులు చేసిందన్నారు.

గోదావరి జలాలను పంచుకునే ఒప్పందంలో భాగంగా జగన్‌, కేసీఆర్‌కు హామీఇచ్చాడని, ఆనీటిని దేవాదులనుంచి సాగర్‌కు తరలించి, అక్కడనుంచి రాయలసీమకు తరలించేలా ఒప్పందం చేసుకున్నాడన్నారు. తరువాత మరలా తననిర్ణయం మార్చుకొని, బొల్లాపల్లి నుంచే తరలించేలా చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. తాజాగా కేసీఆర్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన ఇరిగేషన్‌శాఖ సమీక్షలో ఏపీముఖ్యమంత్రి మరలా ప్లేటు ఫిరాయించాడని కాలవ ఎద్దేవాచేశారు. నాగార్జున సాగర్‌కు గోదావరి జలాలు తరలించి, అక్కడనుంచి వాటిని శ్రీశైలానికి, తరువాత రాయలసీమకు తరలిస్తామని చెబుతున్నాడని, బొల్లాపల్లి-బనకచర్ల ప్రాజెక్ట్‌ని కాదని ఉమ్మడిరాష్ట్రంలోని ప్రాజెక్ట్‌ నమూనాలను అమలు చేయడంద్వారా ఎవరికి మేలుచేయాలని జగన్‌ భావిస్తున్నాడన్నారు. కేసీఆర్‌ని కలిసి రాగానే జగన్‌మదిని పురుగు తొలిచిందని, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్‌లో పనిచేస్తూ, రాయలసీమ ప్రయోజనాలను ఆయనకు తాకట్టు పెట్టడానికి జగన్‌ సిద్ధమయ్యాడన్నారు. హంద్రీనీవా, గాలేరునగరి పథకాల భవిష్యత్‌ గోదావరి-పెన్నా అనుసంధానంతోనే ముడిపడిఉందన్నారు. రాయలసీమకు కృష్ణాజలాలే దిక్కని, కృష్ణానదిలో నీళ్లుతగ్గిపోతున్న తరుణంలో గోదావరి జలాలను కరవుసీమకు తరలించడానికి గతప్రభుత్వం పూనుకుందన్నారు.

చంద్రబాబు పట్టిసీమను పూర్తిచేయకుంటే కృష్ణానదిజలాలపై ఆధారపడిన ఆయకట్టు పరిస్థితి మరోలా ఉండే దన్నారు. పట్టిసీమనీటిని సీమకు కూడా తరలించబట్టే, ఆప్రాంతంలో వేసవిలో కూడా కృష్ణాజలాలు ప్రవహించాయన్నారు. బచావత్‌ట్రైబ్యునల్‌ ప్రకారం 811 టీఎంసీలనీటి వాటాలోని 512టీఎంసీలకు అదనంగా 200, 300 టీఎంసీలను రాయలసీమకు, ప్రకాశం, నెల్లూరుజిల్లాలకు మళ్లించే అవకాశం రాష్ట్రానికి ఉందన్నారు. దీన్నిపక్కనపెట్టి ముఖ్యమంత్రి జగన్‌ నెలకోప్రకటన చేస్తున్నాడన్నారు. హంద్రీనీవాను వెడల్పుచేస్తానని, గాలేరునగరిని విస్తరిస్తానని చెబుతున్న జగన్‌, అవన్నీ ఎలాసాధ్యమవుతాయో చెప్పడం లేదన్నారు. టీడీపీప్రభుత్వం సాగునీటిరంగానికి 72వేలకోట్లు ఖర్చుచేస్తే, వాటిలో రాయలసీమసహా, ప్రకాశం, నెల్లూరుజిల్లాలకే రూ.40వేలకోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యావశ్యకమైన 62ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంటే, వాటిలో రాయలసీమవే 32వరకు ఉన్నాయన్నారు. సీమప్రయోజనాలకోసం గతప్రభుత్వ ం కృషిచేస్తే, జగన్‌సర్కారు వచ్చాక సీమపై శీతకన్నేసిందన్నారు. 8నెలల్లో రాయలసీమ ప్రాజెక్టులకు వైసీపీప్రభుత్వం ఎంతఖర్చుచేసిందో, ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చిందో చెప్పాలని కాలవ డిమాండ్‌చేశారు. హైకోర్టు ఇస్తే రాయలసీమ బాగుపడదని, సాగునీటితోనే సీమ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

కోర్టులొస్తే పేదవాడికి అన్నందొరకదన్నారు. బూటకపు ప్రచారంతో సీమకు ద్రోహంచేసే చర్యలను జగన్‌ ఇకనైనా మానుకోవాలన్నా రు. సీమభవిష్యత్‌ను నాశనం చేసేలా ఆలోచిస్తున్న జగన్‌, ఇప్పటికైనా ఏపీ భూభాగంలో నుంచే గోదావరి నీటిని పారించి, ఆనీళ్లను సీమకు తరలించాలని కాలవ హితవుపలికా రు. సీమప్రాజెక్టుల గురించి, సీమవాసులసంక్షేమం గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలంతా ఇదేఅంశంపై జగన్‌ను ఒత్తిడిచేయాలన్నారు. ఏపీలో కోటిఎకరాలను సస్యశ్యామలం చేయడంకోసం గతప్రభుత్వం రూ.లక్షా20వేలకోట్లతో అనేకసాగునీటి ిప్రాజెక్టులుచేపట్టిందని, జగన్‌సర్కారు వచ్చాక వాటిపరిస్థితి ఎలా ఉందో స్పష్టంచేయాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాలవ డిమాండ్‌చేశారు. వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణం తలపెట్టామని, తద్వారా నాగార్జునసాగర్‌ కుడికాలువకు నీటిని తరలించి, అదేనీటిని బొల్లాపల్లి మీదుగా సోమశిలకు తరలించడానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. కేసీఆర్‌తో సమావేశమైన ప్రతిసారీ, జగన్‌ ఈప్రతిపాదనను ఎందుకు మారుస్తున్నాడని కాలవ నిలదీశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read