70 రోజులుగా అమరావతిలో రైతులు, పెళ్ళాం, బిడ్డలతో కలిసి రోడ్డున పడి, మాకు న్యాయం చెయ్యండి అంటూ, ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయినా 70 రోజులుగా ఒక్కరంటే, ఒక్కరు కూడా, అమరావతి రైతులు దగ్గరకు వచ్చి, ప్రభుత్వం తరుపున చర్చలు జరపలేదు. జగన్ మోహన్ రెడ్డి, ఆ గ్రామాలు మీదుగా సచివాలయం వెళ్తున్నా, వారి వైపు కూడా చూడటానికి ఇష్టం లేక, పోలీస్ బంద్భోస్తుతో, వారిని రోడ్డుల మీద లేకుండా చేసి, సచివాలయానికి వెళ్లి వస్తూ ఉన్నారు. మరో పక్క న్యాయ పోరాటం కూడా రైతులు చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా, ఆ రైతులకు సంతోషం తెప్పించే ఒక్క చర్య కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా, వారి పొట్ట కొట్టే మరో నిర్ణయం తీసుకోవటంతో, అమరావతిలో కలకలం రేగింది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు గారి హయంలో, ఆయనను నమ్మి, 33 వేల ఎకరాలు, నవ్యాంధ్ర కొత్త రాజధాని కోసం, అని రైతులు తమ భూములు ఇచ్చిన సంగతి, అందరికీ తెలిసిందే.
అయితే ఈ భూములు రాజధాని కోసం కాకుండా, మరో కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకుంది. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి, సీఆర్డీఏ పరిధిలో ఉన్న, తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో, ప్రభుత్వం భూమిని సేకరించింది. ఈ ఏరియాలో, 54,307 మందికి, 1251.5 ఎకరాలు ఇవ్వనున్నారు. రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలు కూడా, ఇందులో ఉండటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను పేదలకు పంచుతూ, ఈ రోజు ప్రభుత్వం జీవో జారీ చెయ్యటం, వివాదాస్పదంగా మారింది. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందం ప్రకారం, ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో, 5 శాతం పేదలకు ఉపయోగించవచ్చు అని ఉంది.
అంటే రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల్లో, 1650 ఎకరాలు పేదలకు ఉపయోగించ వచ్చు. ఇందులో భాగంగానే, చంద్రబాబు హయంలోనే, పేదలకు ఇళ్ళ నిర్మాణం కూడా జరిగింది. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం, ఈ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కి, ఏకంగా, నాలుగు వేల ఎకరాల భూమిని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతానికి 1251.5 ఎకరాలు పేదలకు ఇవ్వటానికి, నిర్ణయం తీసుకుంది. అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు కాకుండా, ఎక్కడో విజయవాడ, గుంటూరులో ఉన్న వాళ్లకు ఇక్కడ స్థలాలు ఇవ్వటం పై కూడా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం, ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, మా భూములు పంచి పెట్టటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు జగన ఇచ్చిన జీవోనే రేపు కోర్ట్ లో, ఆయన మెడకే చుట్టుకుంటుందని, ప్రభుత్వం అభాసుపాలు అవ్వటం ఖాయం అని అంటున్నారు.