జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ రోజు నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ పై, అందరికీ ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సభ ద్వారా, భవిష్యత్తు రాజకీయానికి పునాదులు పడతాయని అందరూ భావించారు. ముఖ్యంగా పొత్తుల విషయం పై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తారని భావించారు. అందరూ అనుకున్నట్టుగానే, పవన్ కళ్యాణ్ పొత్తుల పై సంకేతాలు ఇచ్చారు. ప్రసంగం చివరలో పవన్ కళ్యాణ్ పొత్తుల పై మాట్లాడుతూ, బీజేపీ పార్టీ తనకు రోడ్ మ్యాప్ ఇస్తానని చెప్పిందని, ఇప్పటి వరకు ఆ రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, మేము దాని కోసం ఎదురు చూస్తున్నాం అంటూ, బీజేపీ పై అసహనం వ్యక్తం చేసారు. తమకు బీజేపీ ఆ రోడ్ మ్యాప్ ఇస్తే, దాని కోసం పని చేసి, వైసీపీ పై పోరాటం చేస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక తరువాత పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పారు. గతంలో ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అన్ని రాజకీయ పక్షాలు కలిసి పోరాటం చేసయాని, అప్పట్లో ఆ వ్యతిరేకత శక్తులు అన్నీ ఎలా కలిసి పని చేసాయో, ఇప్పుడు కూడా వైసీపీ వ్యతిరేక శక్తులు అన్నీ కలిసి పని చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నా అని, వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభలో స్పష్టం చేసారు.
పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుల కోసం రావాలని అన్నారు. తాను ఇచ్చే వాడినే కానీ, ఏదో కావాలని ఆశించే వాడిని కాదంటూ, పవన్ కళ్యాణ్ పొత్తుల పై స్పష్టం చేసారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర నాయకత్వం సరిగ్గా సహకరించక పోయినా, ఢిల్లీలో ఉండే కేంద్ర నాయకత్వం సూచనలు ప్రకారం పవన్ కళ్యాణ్ పొత్తులో ఉంటున్నారు. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ గురించే ప్రస్తావించారని అనుకోవాలి. వైసీపీ వ్యతిరేక శక్తులలో, తెలుగుదేశం పార్టీ 40 శాతం ఓటు బ్యాంక్ తో బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ముందు ఉండి పోరాటాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ప్రస్తావిస్తూ, ఇది తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న పిలుపుగానే చూడాలి. మరి ఈ విషయం పై బీజేపీ ఎలా స్పందిస్తుంది, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారు, రాష్ట్ర రాజకీయం ఎలా మారుతుంది, రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.