రామోజీ రావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. తెలుగు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఆయనకు స్థానం ఉంది. ప్రభుత్వాలను ఏర్పాటు చేయటంలో, ప్రభుత్వాలని పడేయటంలో కూడా ఆయనది కీలక పాత్ర. రామోజీ రావు ఏదైనా చేసారు అంటే, అదో పెద్ద సెన్సేషన్. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు అనే ప్రచారం ఉంది కానీ, నిజానికి ఆయన సందు దొరికితే టిడిపిని ఇబ్బంది పెట్టిన రోజులు అనేకం ఉన్నాయి. గత టిడిపి హాయంలో ఇసుక కుంభకోణాల గురించి అనేక కధనాలు రాసారు కూడా. రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రచారంతో, రామోజీ రావు ఏదో తెలుగుదేశం సపోర్ట్ అనే ప్రచారం ఉంది కానీ, అది వాస్తవం కాదు. రామోజీ రావు 2004 ఎన్నికల ముందు, రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు అధిక కవరేజ్ ఇచ్చే వారు. అలాగే 2009 ఎన్నికల ముందు చిరంజీవి పార్టీని ఆకాశానికి ఎత్తే వారు. తరువాత రాష్ట్ర విభజన జరిగిన తీరు, జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన రామోజీ, 2014 ఎన్నికల్లో చంద్రబాబు వైపు మొగ్గు చూపుతూ, కధనాలు రాసారు. అప్పట్లో వచ్చిన పాంచజన్యం కాలం అయితే హైలైట్ అనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డిని చీల్చి చెండాడుతో కధనాలు వచ్చాయి. ఒక రకంగా జగన్ ఓటమికి, రామోజీ కూడా కారణం.
అయితే 2019 లో మాత్రం రామోజీ రావు రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. అటు చంద్రబాబుకి అనుకూలంగా కానీ, ఇటు జగన్ కు వ్యతిరేకంగా కానీ, ఎలాంటి సైడ్ తీసుకోకుండా, తటస్థంగా ఉంటూ, ఆయన కధనాలు రాసారు. గత మూడేళ్ళుగా కూడా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరాచకం రాజ్యం ఏలుతున్నా, వార్తను వార్తగా రాసారు కానీ, ఎక్కడా ఒక సైడ్ తీసుకుని రాయలేదు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక కధనాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రజలు పెద్ద మెజారిటీ ఇచ్చిన జగన్ పరిపాలనను వేచి చూసారు. అయితే గత నెల రోజులుగా, ఈనాడు టోన్ బాగా మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక కధనాలు బ్యానర్ ఐటెం కు ఎక్కాయి. విశ్లేషణాత్మక కధనాలు వస్తున్నాయి. రామోజీ రావు గేర్ మార్చినట్టు ఆ పేపర్ చుస్తే అర్ధం అవుతుంది. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ పతనం గ్రహించిన రామోజీ, ప్రభుత్వ వ్యతిరేక కధనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాను రాను ఇంకా ఎలా ఉంటుందో. అందుకే జగన్ గ్యాంగ్ కూడా రామోజీ పై ఎదురు దాడి చేస్తున్నారు. స్వయంగా జగన్ కు రంగంలోకి దిగారు.