నిన్న హైకోర్టులో సిఐడి అడిషనల్ డీజీ సునీల్ కుమార్ పైన, కేసు నమోదు అయ్యింది. సునీల్ కుమార్ తనను వేధిస్తున్నాడు అంటూ, ఆయన మామ పెనుమాక సుబ్బారావు హైకోర్టులో కేసు పెట్టారు. ఈ పిటీషన్ గతంలో దాఖలు అయినప్పటికీ, నిన్న ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. సిఐడి అడిషినల్ డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్, తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తమను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమికంగా విచారణ చేసి, ఆ తరువాత ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం సరైన విచారణ చేయాకపోతే, సిబిఐతో విచారణ జరిపించాలని ఆ పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ విచారణకు అనుమతించాలా లేదా అనే అంశం పై, హైకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పిటీషనర్ తరుపున, సునీల్ కుమార్ మామ పెనుమాక సుబ్బారావు తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారయణ రావు వాదనలు వినిపించారు. ఈ వాదనలు పై సిఐడి వైపు నుంచి , హోం శాఖ వైపు నుంచి కూడా న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు, ఈ కేసుకి విచారణ అర్హత లేదని, కొట్టేయాలని కోరారు.
ఈ విధంగా ఆరోపణలు చేయటం తగదు అని, ఆయన ఒక ఉన్నత అధికారి అని, ఆయన పై ఇలా ఆరోపణలు చేయటం, చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం అని, అందు వల్ల, ఈ పిటీషన్ విచారణకు అనుమతించ వద్దు అని, సిఐడి, హోం శాఖ తరుపున న్యాయవాదులు వాదించగా, సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తమను వేధిస్తున్నాడు అంటూ, పిటీషనర్ తరుపున ఆదినారాయణ రావు సాక్ష్యాలతో సహా వాదనలు వినిపించారు. ఈ వాదనలు అనంతరం, హైకోర్టు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తున్నాం అని, దీనికి విచారణ అర్హత ఉందని ప్రకటించింది. ప్రతి వాదులు అందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర హెం శాఖ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డీవోపీటీకి, సీబీఐ డైరెక్టర్ కి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కు, ఇలా అందరికీ నోటీసులు జారీ చేసి, ఈ నెల 16వ తేదీకి కేసుని వాయిదా వేసింది. సునీల్ కుమార్ మామ, ఎవరో కాదు, మొన్నటి వరకు జగన్ దగ్గర సలహదారుగా పని చేసిన, మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కుమార్ నాన్న.