ఆంధ్రప్రదేశ్ పోలీసులు తరుచూ వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై గతంలో అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. చివరకు డీజీపీ కూడా హైకోర్టు మెట్లు ఎక్కి, హైకోర్టు ఆగ్రహానికి గురి కావలసిన పరిస్థితి. మీకు అసలు సెక్షన్లు తెలుసా అంటూ, హైకోర్టు సెక్షన్లు కూడా చదవమంది అంటే, ఏపిలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాక్ష్యాత్తు డీజీపీ చేతే హైకోర్టు చట్టాలు చదివించింది. అయినా మార్పు లేదు. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్ట్ లు, అక్రమ కేసులు, ఇలా నిరంతరం పోలీసులు తీరు పైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. అనేక మంది హైకోర్ట్ లను ఆశ్రయించారు. ఆయా కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇస్తూ వచ్చింది. అయితే గత కరోనా టైంలో, టీవీ5 చైర్మెన్ బీఆర్ నాయుడు, అలాగే టీవీ5 యాంకర్ మూర్తి పైన ఏపి సిఐడి పోలీసులు కేసులు పెట్టి వేధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, విచారణ పేరుతో వారి ఇరువురిని సిఐడి వేధించిన తీరుతో, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆలోచనలో పడ్డారు. పై స్థాయిలో ఉన్న మా మీదే ఇలాంటి వేధింపులు ఉంటే, కింద స్థాయిలో ఉండే ప్రజలు, హక్కుల కోసం పోరాడే వారి పరిస్థితి, వారు పోలీసులు నుంచి ఎదుర్కుంటున్న వేధింపుల పై దృష్టి పెట్టారు.
వీటికి ఫుల్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో, ఏపి పోలీసులు పై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. చాలా కేసుల్లో అసలు ఎఫ్ఐఆర్ ఏంటో చెప్పకుండా, అరెస్ట్ లు చేస్తున్నారని, కింద స్థాయి మెజిస్ట్రేట్లు కూడా ఇష్టం వచ్చినట్టు రిమాండ్లు వేస్తున్నారని, వీటి పై తగు ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. దీని పైన గత ఏడాది కాలంగా వాదనలు జరిగాయి. న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే 167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్న మాట వాస్తవమే అని కోర్టు కూడా అంగీకరించింది. ఇష్టం వచ్చినట్టు రిమాండ్ వేయటం అనేది హక్కులను భంగపర్చడమే అని, అసలు ఎఫ్ఐఆర్ లో ఏమి ఉందో చెప్పక పోవటం అనేది చట్ట ఉల్లంఘన అని కోర్టు పేర్కొంది. ఇష్టం వచ్చినట్టు రిమాండ్ లు విధించటం కుదరదు అని పేర్కొంటూ, కింద కోర్టులో ఉన్న జడ్జీలు కూడా విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని, ఎలా పడితే అల రిమాండ్ విధిస్తే, మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు కుడా ఉంటాయని, అలాగే ఎఫ్ఐఆర్ ని కూడా 24 గంటల్లో రెడీ చేయాలని కోర్టు ఆదేశించింది.