రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఒక వైపు చర్చలు జరుపుతూ, మరో వైపు ఎస్మా ప్రయోగానికి తెర లేపుతూ, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్మాకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి దగ్గర, నిన్న అధికారులు, మంత్రులు చర్చించారు. తరువాత చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ , వివిధ శాఖల అధిపతులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతోనూ నిన్న సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎస్మా ప్రయోగానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా అత్యవసర శాఖల్లో ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు పైన కూడా దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే కొద్ది సేపటి క్రితం, గనుల శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. సమ్మె , ఇతర ఆందోళన పైన, మైనింగ్ శాఖలో నిషేధం విధించారు. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని, ఉద్యోగులకు ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేసారు. మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్తర్వులు పైన ఆశ్చర్య పోతున్నారు. మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ బయటకు వచ్చిన ఉత్తర్వులను, ఒక పక్క మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు తెలుసుకున్నారు.
బయట ఉన్న ఉద్యోగులు, చర్చల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు, ఎస్మా ఉత్తర్వులు గురించి చెప్పారు. ఒక పక్క చర్చలు జరుపుతూనే, ఎస్మా ప్రయోగించటం ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం తమను బెదిరిస్తుంది అని కూడా, వారికి చెప్తూ, దీని పైన కూడా మంత్రులతో మాట్లాడాలని, గట్టిగ నిలదీయాలని, ఉద్యోగ సంఘాల నేతల పైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ అంశం పైన మంత్రి వర్గంతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఫిట్ మెంట్ విషయంలో కూడా వెనక్కు తగ్గవద్దు అంటూ, వారి పైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఒక పక్క చర్చలు అంటూ పిలిచి, మరో వైపు కొన్ని శాఖలతో, ముందుగానే ఎస్మా ప్రయోగించటం పైన, ఉద్యోగులు షాక్ తిన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కూడా షాక్ అయ్యారు. ఒక పక్క కుటుంబ సభ్యులు అంటూ, ఉద్యోగులను మంచి చేసుకున్నట్టు నటిస్తూ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, జీతాలు తగ్గించి, రికవరీ పేరిట ఉద్యోగుల నుంచే తీసుకుని, ఈ పనులు ఏమిటి అంటూ, ఉద్యోగులు ఆశ్చర్య పోతున్నారు. ఎస్మా ప్రయోగించి, ఎంత మంది పై చర్యలు తీసుకుంటారో చూస్తాం అని అంటున్నారు.