ఇది వినటానికి వింతగా ఉన్న నిజం. జగన్ మోహన్ రెడ్డి, బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసారు. ఇది చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ఢిల్లీ బీజేపీలో కీలక నేత. ఒక పక్క బీజేపీని , జగన్ మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేస్తారు కానీ, జగన్ ని ఏమి అనరు. జగన్ మోహన్ రెడ్డి కూడా 28 మంది ఎంపీలు ఉన్నా, ఏ నాడు బీజేపీ పై ఒత్తిడి తీసుకుని రారు. ఎలాంటి షరతులు లేకుండా బిల్లులకు మద్దతు ఇస్తారు. ఇక ఇక్కడ జగన్ మొహన్ రెడ్డి ఏమి చేసినా, కేంద్రం పట్టించుకోదు. అడ్డగోలు అప్పులు చేసినా, శాంతి భద్రతలు అయినా, అసలు బీజేపీ పట్టించుకోదు. పై పెచ్చు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని, మోడీ తండ్రిలాగా ఆదుకుంటున్నారు అంటూ చెప్తారు. ఇవన్నీ చూసిన వారికి, జగన్ మోహన్ రెడ్డి బీజేపి వెన్ను పోటు పొడిచే సాహసం చేసారు అంటే నమ్మరు. ఒక పక్క కేసులు వేలాడుతూ, ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుందో తెలియని పరిస్థితిలో , జగన్ మోహన్ రెడ్డి ఇంతటి సాహసం చేస్తారా అనే అనుమానం కలుగక మానదు. అయితే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడించటానికి, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి, అఖిలేష్ యాదవ్ కు భారీగా ఆర్ధిక సహాయం చేసారని, మూడు వేల కోట్ల వరకు జగన్ మోహన్ రెడ్డి పంపించారని, దీని పైన తమకు పక్కా సమాచారం ఉందని, ఇప్పటికే ఈ విషయం పై కేంద్ర సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయని, త్వరలోనే ఈ విషయం పై సంచలన విషయాలు బయట పెడతాం అంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో గుబులు రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ గెలిచి బీజేపీ ఓడిపోతే, తమ పైన బీజేపీ మరింత ఆధార పడుతుందని, జగన్ భావించారని, అందుకే ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్ కు మద్దతు పలికి, బీజేపీని ఓడించటానికి ఆర్ధిక సాయం చేసారు అంటూ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే అనూహ్యంగా ఈ వ్యాఖ్యలు చేసి, రెండు రోజులు అవుతున్నా, వైసీపీ నుంచి ఒక్కరు అంటే, ఒక్కరు కూడా ఇంత పెద్ద ఆరోపణలను ఖండించ లేదు. ఇదే నిజం అయితే కనుక, బీజేపీ నుంచి జగన్ కు గడ్డు పరిస్థితి తప్పదు.