గన్నవరం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ సింబల్ పై గెలిచిన వంశీ, తన పైన అక్రమ కేసులు పెడతారాని భయపడి, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఇది టిడిపి కాదు, వైసీపీ శ్రేణులే నిజం అని చెప్తున్నాయి. ఎమ్మెల్యేని పార్టీలోకి లాక్కోవటమే కాక, గన్నవరం వైసీపీ ఇంచార్జ్ పదవి ఇవ్వటం పై కూడా, వైసీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. గత వారం రోజులుగా విజయసాయి రెడ్డి, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నారు. ఈ క్రమంలోనే, గన్నవరం వైసీపీ శ్రేణులు, విజయసాయి రెడ్డి దగ్గరకు వచ్చి, తమ గోడు చెప్పుకున్నారు. అంతే కాదు, విజయసాయి రెడ్డికి ఇచ్చిన లేఖను కూడా బహిరంగ పరిచి, షాక్ ఇచ్చారు. గన్నవరంలో ఇప్పటికే వైసీపీ తరుపున యార్లగడ్డ వెంకట్రావు బలంగా ఉన్నారు. అయితే వంశీ వచ్చిన దగ్గర నుంచి వెంకట్రావు వర్గీయులను లెక్క చేయటం లేదు. అలాగే మరో వర్గం దుట్టా రామచంద్రరావు వర్గం కూడా ఉంది. వాళ్ళు కూడా వంశీని లెక్క చేయటం లేదు. అయితే ఈ రోజు గన్నవరం వైసీపీ శ్రేణులు వంశీ పై తిరుగుబాటు చూపించాయి. విజయసాయి రెడ్డి వద్ద తాడో పేడో తేల్చుకోవటానికి వచ్చారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది.
అందులో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, వంశీ వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చాడు అని ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు వంశీ వైసీపీలో చేరినట్టు ఎక్కడా ఓపెన్ గా చెప్పలేదు. అనర్హతకు గురు అవుతాడని కారణం. కానీ మొదటి సారి విజయసాయి రెడ్డి, మనం లాక్కున్నాం అని ఒప్పుకున్నారు. తమకు కొంత సమయం కావాలని, సియంతో మాట్లాడి చెప్తానని విజయసాయి రెడ్డి చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇక విజయసాయి రెడ్డికి రాసిన లేఖ కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రధానంగా దాంట్లో, వంశీకి గన్నవరం బాధ్యతలు ఇవ్వకూడదని, ఇంకా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ, వంశీకి మాత్రం ఇవ్వద్దు అని కోరారు. వంశీ తమను అనేక వేధింపులు గురి చేసాడని, ఇప్పుడు మన పార్టీలోకి వచ్చి మా మీదే పెత్తనం చేస్తున్నాడని అన్నారు. ఇక ఆ లేఖలో మరో విషయం, వంశీ అవినీతి కేసుల్లో ఇరుక్కుని, కేసులు, జైలు భయంతో పార్టీ మారాడు అంటూ, పరోక్షంగా వైసీపీ అధిష్టానం వైఖరిని కూడా వైసీపీ శ్రేణులు తప్పుబట్టాయి.