ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టెండర్లు వేసేందుకు ఎవరూ రావటం లేదు అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో 1250 పనులకు పంచాయతీ రాజ్ అండ్ ఆర్ అండ్ బీ లో వర్క్స్ కోసం టెండర్ లు పిలిస్తే, అందులో 900 పనులకు కాంట్రాక్టర్ లు ఎవరూ ఒక్క టెండర్ కూడా వేయలేదు. అందుకే ఈ రోజుకీ కూడా రాష్ట్రంలో, పంచాయతీ రాజ్ అండ్ ఆర్ అండ్ బీ లో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పుడు తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ లో ఒక విచిత్ర క్లాజ్ పెట్టింది. అందులో ప్రభుత్వం కాంట్రాక్టర్ లకు డబ్బులు ఇవ్వక పోతే కోర్టుకు వెళ్ళకూడదని, పని పూర్తయినా కూడా బిల్లు వచ్చే వరకూ కూడా, కాంట్రాక్టర్ కానీ, సంబంధిత ఏజెన్సీ కానీ ఎదురు చూడాలని, అందులో పెట్టారు. అలాగే తమకు డబ్బులు రాలేదని కోర్టుకు వెళ్తే మాత్రం, వారు టెండర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే తాము ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే తీసుకోవాలని, డబ్బులు ఇవ్వటం లేదని, కోర్టుకు వెళ్తే కుదరదు అంటూ, అందులో తెలిపిన విషయం చూసి, కాంట్రాక్టర్లు ఆశ్చర్య పోయారు. ఎప్పుడూ లేని విధంగా, ఇదేమి క్లాజ్ అని, ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే ఉద్దేశం లేకపోతేనే ఇలాంటివి పెడతారని అన్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బయట పెడుతున్న లెక్కలు కానీ, వివిధ ఆర్టిఐ లెక్కల్లో వస్తున్న వాస్తవాలు కానీ, కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన బిల్లులు లక్ష కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయని, ఈ బిల్లులు నేటి వరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుకి అదనం. ఇక అలాగే నరేగా పనులకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఆపివేయటంతో, 7 వేల కోట్లకు సమబందించి, 500 కేసులు దాఖలు అయి ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుల పై జడ్జిమెంట్ ఇచ్చింది. కేంద్రం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా, కేంద్రం మేము మొత్తం ఇచ్చేసాం అని చెప్పటంతో, డబ్బులు మొత్తం ఇవ్వాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. దీంతో ఇప్పుడు కొత్తగా పిలిచే టెండర్లలో, ఎవరూ కోర్టుకు వెళ్ళకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఎత్తు వేసింది. అయితే ఈ టెండర్ లో కూడా, ఈ రోజు గడువు ముగియటంతో, ఒక్కరు కూడా ఈ టెండర్ కూడా వేయలేదని తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది.