జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాల పై, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నార లోకేష్ విరుచుకు పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలకు, జగన్ మోసపు రెడ్డి అంటూ, నారా లోకేష్ విమర్శల దా-డి పెంచారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా మూడేళ్ళు పూర్తి చేసుకోవటం, మరో ఏడాదిలో ముందస్తు ఎన్నికలు ఉంటాయి అనే అభిప్రాయాల నేపధ్యంలో, నారా లోకేష్ దూకుడు పెంచారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అమ్మఒడి పధకం పైన పెట్టిన ఆంక్షలను, లోకేష్ తప్పు బడుతూ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి సతీమణి, వైఎస్ భారతి వీడియోని, లోకేష్ పోస్ట్ చేసి, భారతిని టార్గెట్ చేసారు. 2019 ఎన్నికల ప్రచారంలో, వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేసారు. ఆ సందర్భంగా ఆమె మహిళలతో మాట్లాడిన వీడియోని లోకేష్ పోస్ట్ చేసారు. అందులో భారతి మహిళలతో మాట్లాడుతూ, "మీ మహిళల కోసమే జగన్ జగనన్న అమ్మఒడి పధకం పెట్టారు. ఒక పిల్లోడు ఉంటే రూ.15 వేలు, మరో పిల్లడు ఉంటే ఇద్దరికీ కలిపి రూ.30 వేలు ఇస్తారు అంటూ" భారతి చెప్పిన వీడియోని లోకేష్ పోస్ట్ చేసి, జగన్ ని టార్గెట్ చేసారు. అమ్మకు అన్నం పెట్టటం చేతాకాడు కానీ, పిన తల్లికి మాత్రం బంగారు గాజులు చేపిస్తాడు అనే విధంగా జగన్ అమ్మ ఒడి పధకం ఉందని లోకేష్ విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, కేవలం ఒక్కరికి మత్రమే అమ్మ ఒడి ఇస్తున్నారని, అందులో రూ.1000 మరుగుదొడ్లు కోసం అని ఎగ్గొట్టి ఇస్తున్నారని, అలాగే ఇప్పటికే తేదీలు మార్చేసి ఒక ఏడాది ఎగ్గొట్టారు అంటూ లోకేష్ విమర్శించారు. ఇప్పుడు తాజాగా అమ్మ ఒడి పై కొత్త నిబంధనలు పెట్టారని, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే కట్ చేస్తాం, 75% అటెండెన్స్ ఉండాలి, ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేరు ఉండాలి, కొత్త బియ్యం కార్దు ఉండాలి అంటూ, రకరకాల నిబంధనలు, ఆంక్షలు పెట్టారని, ఇది కేవలం ఎక్కువ మందికి అమ్మ ఒడి ఎగనామం పెట్టటానికే అంటూ లోకేష్ విరుచుకు పడ్డారు. దీనికి తోడుగా వైఎస్ భారతి మాట్లాడిన వీడియోని లోకేష్ పోస్ట్ చేసారు. అందులో స్పష్టంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి వస్తుంది, మీరు ఫ్యాన్ కు ఓటు వేసి గెలిపించాలి అంటూ, వైఎస్ భారతి మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు తరువాత ఒక మాట చెప్పి, జగన్ మోహన్ రెడ్డి ఎలా మోసం చేసారో చెప్తూ, జగన్ మోహన్ రెడ్డిని, లోకేష్ ఎక్ష్పొజ్ చేసారు.