ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏది అనే దాని పైన గందరగోళం జరుగుతున్న సమయంలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకుని, మరో కొత్త వివాదానికి తెర లేపారు. టెన్త్ క్లాస్ తెలుగు పుస్తకంలో ఉన్న అమరావతి పాఠాన్ని సిలబస్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాఠంలో అమరావతి కి ఉన్న చారిత్రాత్మక విషయాల గురించి వివరించడం జరిగింది. శాతవాహన రాజులు ఈ అమరావతిని ఎలా పరిపాలించారు అనే చారిత్రాత్మక అంశాల పైన కూడా వివరించారు. అంతే కాకుండా పిల్లల్లో అవగాహన కలిగించడం కోసం ఆంధ్రప్రదేశ్ లో అమరావతినే రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారనే విషయం కూడా వివరించడం జరిగింది. అయితే తాజాగా ఈ అమరావతి పాఠాన్ని సిలబస్ నుంచి తొలగిస్తున్నామని విద్యాశాఖ ఉన్నతదికారులు ప్రకటించారు. అయితే అధికారుల వాదన మాత్రం మరో రకంగా ఉంది. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం లేటుగా మొదలు కావడంతో విద్యార్ధులపై వత్తిడి తగ్గించడానికే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఈ అమరావతి పాఠాన్ని పదో తరగతి లో రెండో పాఠంగా ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పై గందరగోళం నెలకొల్పారు.
వారు అధికారంలోకి వచ్చి దాదాపు మూడు ఏళ్ళు కావస్తున్న ఇప్పటివరకు రాజధానిని ప్రకటించనే లేదు. పైగా AP కి మూడు రాజధానులు పెడతామంటూ కొత్త సమస్యలకు తెర లేపుతున్నారు. అయితే తాజాగా వచ్చిన కోర్టు ఉత్తర్వులతో అమరావతిని అభివృద్ధిచేస్తామని, కాని మూడు రాజధానులు విషయం పై మాత్రం ముందుకే వెళ్తామని స్పష్టం చేసింది . అయితే జగన్ ప్రభుత్వానికి మాత్రం అమరావతిని రాజధాని చేసే ఉద్దేశమే లేదని అందుకే అమరావతి పాఠాన్ని తొలిగించారని విమర్శలు ఎదుర్కుంటున్నారు. అయితే, ఈ పాఠాన్ని విద్యార్దులకు భోదించడం అయిపోయిందని టీచర్లు చెప్తున్నారు. మరో పక్క ఏప్రిల్ 4 నుంచి టెన్త్ విద్యార్దులకు ప్రి పబ్లిక్ పరీక్షలు కూడా మొదలవుతున్న నేపధ్యంలో పిల్లలు సిలబస్ లో అమరావతి మరియి వెన్నెల లెసన్లు తప్పించి మిగతా వాటికి ప్రిపేర్ అవ్వాలని ఉపాద్యాయులు సూచించారు. ఒకవేళ విద్యార్దులకు భారం తగ్గించాలంటే సిలబస్ లో ఉన్న చివర పాఠాలను తొలగించాలి కాని రెండో లెసన్ గా ఉన్న అమరావతి పాఠాన్ని తొలగించడ మేమిటని విద్యార్దుల తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ పాఠాన్ని ఇప్పటికే విద్యార్దులు చదివేసారని పరీక్షల సమయంలో ఈ నిర్ణయం సరికాదని అటు విద్యాసంస్థలు, ఇటు విద్యార్దులు, వారి తల్లితండ్రులు కూడా అభిప్రాయ పడుతున్నారు.