ఎవరైనా మంత్రి వర్గ విస్తరణ అంటే గంతులు వేస్తారు. ముఖ్యంగా సీనియర్ నేతలు అయితే వేగంగా పావులు కదుపుతారు. తమ పలుకుబడి ఉపయోగించి, ఆర్ధికంగా తమ సత్తా చూపించి, ఎలాగైనా మంత్రి పదవి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది మాత్రం భిన్నం. అన్నీ తెలిసిన సీనియర్ లు, మంత్రి పదవుల పై ఆసక్తి చూపటం లేదు. కొత్తగా వచ్చిన వారు మాత్రం, ఆత్రంగా మంత్రి పదవుల కోసం భజనలు చేస్తున్నారు. ఇక వివారల్లోకి వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి, రెండున్నరేళ్ళకు, తాను మంత్రి పదవులను మార్చేస్తాను అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రెండున్నరేళ్ళు దాటి పోయి, మూడో ఏడాది కూడా వచ్చేస్తుంది. జగన్ మాత్రం ఉగాది, ప్లీనరీ అంటూ, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పదవి కోసం ఆశిస్తున్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, భజన నెక్స్ట్ లెవెల్ లో చేసారు. అయితే సీనియర్లు మాత్రం, మంత్రి పదవుల కోసం ఆసక్తి చూపటం లేదు. ఇందుకు ప్రధాన కారణం, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కుంటున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం. అభివృద్ధి అనేది ఎలాగూ లేదు, కనీసం పధకాలతో అయినా నెట్టుకుని వద్దాం అనుకుంటే, అది కూడా లేకుండా పోతుంది.
దీనికి తోడు ఇన్నాళ్ళు మంత్రులు ప్రజల్లోకి వెళ్ళకుండా సరిపోయింది, ఇప్పుడు మాత్రం మంత్రులు ప్రజల్లోకి నిత్యం వెళ్ళాల్సిన పరిస్థితి. జగన్ కూడా జనాల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కాలం కూడా. దీంతో ఏమి చేయకుండా, ప్రజల్లోకి వెళ్తే, ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అని వారి భయం. ఇక దీనికి తోడు, మంత్రులు తాము గెలవటమే కాక, ఆ జిల్లలో ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి చెప్పటంతో, ఇదెక్కడి ఫిట్టింగ్ అని, ఇలాంటి మంత్రి పదవులు తీసుకోకపోవటమే నయం అని, సీనియర్లు మాత్రం, మంత్రి పదవులు రాకపోతేనే బాగుండు అని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఉన్న మంత్రులు తమ పదవులు ఎలాగూ పోతాయి కదా, ఇంకా ఎందుకు పని చేయటం అని లైట్ తీసుకున్నారు. ఇక మంత్రి పేషీలో సిబ్బంది కూడా, కొత్త మంత్రులు వస్తే తమను పీకేస్తారేమో అని అభద్రతాభావంలో ఉన్నారు. దీంతో పాలన మొత్తం పడక ఎక్కింది. జగన్ మాత్రం, ప్లీనరీ తరువాతే విస్తరణ అంటున్నారు. అసలు ఇది జరిగే పనో కాదో మరి.