జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఘన సన్మానం చేయలని, దానికి తన ఆచార్య సినిమాని ఉపయోగించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు. ఈ నెల 27న విడుదల కానున్న ఆచర్య సినిమా కోసం, ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని, ఆంధ్రప్రదేశ్ లో చేసి, జగన్ మోహన్ రెడ్డికి ఇదే వేదిక పై సన్మానం చేస్తే ఎలా ఉంటుందని అలోచించి, ఈ విషయం జగన్ తో చెప్పటం, దానికి జగన్ కూడా ఒప్పుకోవటంతో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జగన్ వస్తున్నారని, తెలుగు సినిమా ఇండస్ట్రీ తరుపున, జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేస్తున్నాం అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా ఈ విషయం హోరెత్తి పోయింది. ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కేసులు చూసే వ్యక్తిగా నిరంజన్ రెడ్డికి పేరు ఉంది. గతంలో సినిమా టికెట్ల ఇష్యూ వచ్చినప్పుడు కూడా, జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు, చిరంజీవిని తీసుకుని వెళ్ళటంతో, నిరంజన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. ఈ నేపధ్యంలోనే, జగన్ మోహన్ రెడ్డికి, ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా, సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుని, మీడియాకు సమాచారం ఇచ్చారు.
అయితే ఏమైందో ఏమో కానీ, సడన్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ , వేదిక మారిపోయింది. విజయవాడలో కాకుండా, హైదరాబాద్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో పెడుతున్నారు అంటే, ఇక అక్కడ జగన్ మోహన్ రెడ్డికి సన్మానం చేసే అవకాశమే లేదు. ఈ సడన్ మార్పు వెనుక రాజకీయ కోణాలే కనిపిస్తున్నాయి. ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే, ఈ ప్రోగ్రాం కు జగన్ రాలేనని చెప్పటంతోనే, వేదిక మార్చినట్టు చెప్తున్నారు. చిరంజీవి సినిమా ఫంక్షన్ అంటే, మెగా స్టార్ ఫాన్స్ తో పాటు, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా అక్కడకు వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పై, పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే పరిస్తితి చేయిదాటి పోయి, జగన్ మోహన్ రెడ్డికి అవమానకరంగా మారే ప్రమాదం ఉండటం, అక్కడ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం కాబట్టి, ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా ఉండటమే మంచిదని, జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన రిపోర్ట్ మేరకే, ఈ కార్యక్రమాన్ని జగన్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే వేదికను హైదరాబాద్ కు మార్చినట్టు తెలుస్తుంది.