దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కోర్టులో దొంగతనం, మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం, నెల్లూరు జిల్లా కోర్టులో, కోర్టు రికార్డు రూమ్ తాళం బద్దలు కొట్టి, ఒకే ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు దొంగలు ఎత్తుకు పోయారు. అయితే ఎత్తుకు వెళ్ళే క్రమంలో, కొన్ని కాగితాలు పడేసి వెళ్ళిపోవటంతో, విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కేసు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు ఆధారాలు కావటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి పై కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసారు. దీని పై విచారణ చేసిన పోలీసులు, ఫోర్జరీ చేసినట్టు నిర్ధారించి, కేసు పెట్టారు. ఈ కేసు వైసీపీ అధికారంలోకి రాగానే, ప్రభుత్వం కేసు క్లోజ్ చేసింది. అయితే హైకోర్టు మాత్రం ఊరుకోలేదు. అలా ఎలా క్లోజ్ చేస్తారు అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు పై విచారణ జూన్ నెలలో జరగనుంది. ఈ క్రమంలోనే, ఇప్పుడు కేవలం కాకానికి సంబంధించిన కేసు ఫైల్స్ మాయం అవ్వటంతో, అందరూ అవక్కయ్యారు. ఫోర్జరీ కేసు కావటంతో, ఇందులో ముఖ్యంగా ల్యాప్ టాప్, ట్యాబ్ చాలా కీలకం. అవే మాయం అయ్యాయి. దీంతో ఈ కేసు రాజకీయ కోణం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ విరుచుకు పడింది.
కాకాని కావాలనే మాయం చేపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసు పై పోలీసులు విచారణ చేసారు. ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్పీ దొంగతనం చేసిన వారికి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నెల్లూరు ఎస్పీ ఏమి చెప్తారా అని అందరూ ఎదురు చూడగా, ఆయన జరిగిన విషయం చెప్పుకొచ్చారు. ఈ దొంగలు ఐరన్ దొంగలు అని, పాత సామాన్లు ఎత్తుకు పోయే వారని, ఈ క్రమంలోనే వీరికి కోర్టు దగ్గర ఐరన్ ఉందని తెలుసుకుని, ఆ ఐరన్ దొంగ తనం కోసం ముందుగా కోర్టు వద్దకు వచ్చినట్టు చెప్పారు. అయితే అక్కడ కుక్కలు మొరగటంతో, భయపడి, కోర్టు లోపలకు వెళ్లి, అక్కడ రికార్డు రూమ్ తలుపు బద్దలు కొట్టి, బీరువాలో , కాకాని ఫైల్స్ కు సంబంధించి బ్యాగ్ ఉండటంతో, బ్యాగ్ లో ఏముందో కూడా చూడకుండా, ముందు అక్కడ నుంచి పారిపోయి, తరువాత ఆ బ్యాగ్ లో ఉన్న ల్యాప్ టాప్, ఫోన్ తీసుకుని, మిగతా కాగితాలు పడేసినట్టు చెప్పారు. అయితే నెల్లూరు ఎస్పీ గారు చెప్పిన విషయం పై, అనేక ప్రశ్నలు వస్తున్నాయి. నెల్లూరు పోలీసులు చెప్పిన విషయం నమ్మసక్యంగా లేదని ఇంటర్నెట్ లో అనేక ట్రోల్స్ వస్తున్నాయి.