విజయవాడ కనకదుర్గ గుడిలోకి ఇప్పుడు ఎంతమంది భక్తులు వస్తున్నారన్నది తెలుసుకోవడం సులభతరమయింది. భక్తులు ఎవరన్నది కూడా ఇట్టే తెలుసుకునేందుకు వీలవుతున్నది, తిరుమల, ఇంకా ఇతర పెద్ద ఆలయాలలో అమలులో ఉన్న సెక్యూరిటీ వ్యవస్థను దుర్గ గుడిలో కూడా అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు.
తిరుమలలో కూడా డీవోటీ యాక్సెస్ విధానాన్ని అమలు చేసిన ట్రైలోక్ సంస్తే దుర్గ గుడిలో కూడా ఆ విధానాన్ని ఏర్పాటు చేసింది. దుర్గగుడి ఈవో సూర్యకుమారి యాక్సెస్ కారును ప్రారంభించి, పని చేసే విధానంపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు.
దుర్గగుడిలో ప్రస్తుతం ఉచితంగా దర్శనం చేసుకునే భక్తులకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. దర్శనానికి వచ్చే భక్తుల ఫొటోలను, ఐడింటిటీని ముందుగా తీసుకుని కార్డు ఇస్తారు. కార్డును మరల కౌంటర్లో చూపించిన తరువాత స్కాన్ చేస్తారు. ఆ తరువాత భక్తులు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో దర్శనానికి ఎవరు వచ్చారన్నది ఫొటోలో తెలిసిపోతుంది. దీంతో పాటుగా ఎంతమంది భక్తులు నికరంగా అమ్మవారిని దర్శించుకున్నారనే కాకిలెక్కలకు ఇక తావు ఉండదు.
భద్రతకు సంబందించి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. భక్తుడి ఫొటోను స్కాన్ చేస్తున్నందున ఆలయం లోపల ఎవైనా అనుకోని సంఘటనలు జరిగితే ఇట్టే గుర్తించేందుకు వీలుంటుంది. దుర్గమల్లేశ్వరస్వామి దేవస్థానంలో అమరావతి రాజధాని ఆయ్యాక అనేక నూతన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో దర్శనాల దగ్గరనుంచి ప్రతి అంశాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు. అమ్మవారికి సంబంధించి ఇప్పటికే కొన్ని కొత్త రకాల ఆర్జిత సేవలు భక్తులకు పరిచయం అయ్యాయి.