ఏపిలో కాబినెట్ మార్పులు చేసే కంటే ముందు ఎప్పటి నుంచో తెలంగాణలో కూడా మంత్రివర్గ మార్పులు జరుగుతాయని విస్తృతమైన ప్రచారం జరిగింది. మంత్రి వర్గ మార్పులు చేయాలనే ఉద్దేశంతోనే కొత్తగా ఎమ్మెల్సీల్ని కూడా ఎంపిక చేసారనే వార్తలు కూడా వచ్చాయి. తెలంగాణా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం అంతా సంక్రాంతి పండగప్పుడే జరుగుతుందని ప్రచారం జరిగినా, ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా కెసిఆర్ చెయ్యలేదు. ఇప్పుడెమో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితి చుసిన తరువాత, కేసీఆర్ అసలు క్యాబినెట్ విస్తరణ నిర్ణయం తీసుకోరనే వార్తలు వస్తున్నాయి. జగన్ కాబినెట్ ను మార్చిన తరువాత పార్టీలో వ్యతిరేకత ఎక్కువైంది. ఇప్పటి వరకు పార్టీలో ఉన్న అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అలక పాన్పు ఎక్కారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి బంధువు అయిన బాలినేని కూడా ఎదురు తిరిగారు. ఇక చాలా మంది ఎమ్మెల్యేలు బయట పడకపోయినా లోలోపల రగిలిపోతూ అవకాసం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సీనియర్ మంత్రులు బొత్సా, పెద్దిరెడ్డికి పదవి రాదని ముందు వార్తలు వచ్చినా, వారు ఢిల్లీ లెవెల్ లో చేసిన ఒత్తిడితో వారిని కూడా తీసుకుని, చివరకు ఒత్తిడికి తలొగ్గి, 11 మంది పాత వారినే కొనసాగించారు.
కేసీఆర్ తెలంగాణాలో 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. పార్టీ నేతల్లో అంతర్గతంగా ఈయనకు జగన్ కంటే ఇంకా ఎక్కువె వ్యతిరేకత ఉంది. అందులోను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నేతలందరూ పదవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ కనుక కాబినెట్లో మార్పులు చేస్తే విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనివల్ల లేని పోని తలనొప్పులు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మరో పక్క బీజేపీ కూడా కేసీఆర్ ని దెబ్బ తీయటానికి అన్ని విధాలుగా రెడీగా ఉంది. అందుకే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, ఇప్పుడున్న మంత్రివర్గంతోనే కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎలాగూ తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఉన్న పాత మంత్రులతోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారని సమాచారం. జగన్ ఎదురుకున్న వ్యతిరేకత చూసి, కేసీఆర్ అలెర్ట్ అయ్యారు.