ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కు రాష్ట్ర మంత్రి వర్గం, ఆన్లైన్ లో ఈ రోజు ఆమోదం తెలిపింది. గత రెండేళ్ళుగా కూడా ప్రభుత్వం బడ్జెట్ ని ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ఇలా ఆర్డినెన్స్ రూపంలో రావటంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా , ప్రభుత్వం మాత్రం, ఎన్నికల వల్ల పెట్టలేక పోయాం అంటూ సాకులు చెప్తుంది. అందుకే బడ్జెట్ సమావేశాలు వాయిదా వేశామని చెప్తున్నారు. వచ్చే నెల నుంచి బడ్జెట్ లేకపోతే రూపాయి కూడా ఖర్చు పెట్టలేరు కాబట్టి, ఈ లోపు ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ తీసుకుని రావాలని భావించి, ఈ ఆర్డినెన్స్ ను రూపొందించి, ప్రస్తుతం ఎటువంటి క్యాబినెట్ సమావేశం లేకపోవటంతో, ఆన్లైన్ లో సమావేశం పెట్టి, ఆర్డినెన్స్ ఆమోదించారు. ఇందు కోసమని, మూడు నెలలు కాలానికి ఆర్డినెన్స్ తెచ్చి, దీనికి మంత్రులు ద్వారా ఆన్లైన్ లో ఆమోదం తీసుకుని, మొత్తం 80 నుంచి 90 వేల కోట్లతో, ఈ మూడు నెలల కాలానికి బడ్జెట్ ని రూపొందించారు. ఈ బడ్జెట్ ని కేవలం ఉద్యోగుల జీతాలు, నవరత్న పధకాల అమలు కోసం మాత్రమే , ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు. అయితే వచ్చే నెలలో వీలు చూసుకుని, బడ్జెట్ సమావేశాలు పెట్టి, అసెంబ్లీలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు.
కొత్తగా వచ్చే ఎన్నికల కమీషనర్, ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికల పై ఏదో ఒక నిర్ణయం తీసుకునే దాకా, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు. అలాగే తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. ఈ ఎన్నికలతో పాటుగా, సహకార సంఘాల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇవన్నీ అయిన తరువాతే, బడ్జెట్ సమావేశం పెట్టి, బడ్జెట్ ఆమోదం తెలపలాని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పోయిన ఏడాది కూడా ఇలా ఆర్డినెన్స్ తో బడ్జెట్ తెచ్చారని, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారని, దీని వల్ల పారదర్శకత లోపిస్తుందని టిడిపి సీనియర్ నేత యనమల విమర్శించారు. తెలంగాణా రాష్ట్రానికి, కేంద్రానికి లేని అడ్డంకి మనకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఎన్నికలు అనేవి సాకు మాత్రమే అని అన్నారు. రెండు మూడు రోజులు సమావేశం పెట్టుకోవటానికి ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. గవర్నర్ కూడా, ప్రభుత్వం తెచ్చే ప్రతి అంశాన్ని సమర్ధించకుండా, నిపుణులతో విశ్లేషించాలని, ప్రతి ఏడాది ఆర్దినెన్స్ ద్వారా బడ్జెట్ తెచ్చే కొత్త సంస్కృతికి తెర లేపారని విమర్శించారు.