రాజధాని అమరావతిలో దళితుల అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పి నారాయణ ప్రమేయం ఉన్నట్టు సిఐడి ఎలాంటి ఆధారాలు చూపకపోవటంతో, నాలుగు వారాల పాటు ప్రాసిక్యూట్ చేయరాదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం లేదా సుప్రీం కోర్టుకు అప్పీలకు వెళ్లే యోచనలో సీఐడీ అధికారులు ఉన్నారు. అసైన్ భూములకు సంబంధించి కేసు పెట్టిన సీఐడీ ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న ఆధారాలతో ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా చంద్రబాబుకు ఇటీవలే నోటీసులు అందజేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే మంజూరు చేయటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, సాక్షాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయనే వాదనతో హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీం కోర్టులో అప్పీల్ పిటిషన్ వేసేందుకు సీఐడీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అసైన్ భూములు కొనుగోళ్లు చేసిన కొందరు వ్యక్తులు అప్పటి ప్ర భుత్వ పెద్దలకు సన్నిహితులుగా ఉన్నారని అవే భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించి ప్రత్యామ్నాయంగా నివాస, వాణిజ్య స్థలాలను కేటాయించారనేది సీఐడీ ఆరోపణ. ఇందులో భాగంగానే జీవో 41 జారీ చేశారనేది ప్రభుత్వ వాదన. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కేసుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకూడా సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు.
అయితే కోర్టు ఆధారాలు అడగగా, ఇప్పటిప్పుడు ఏమి ఆధారాలు లేవని, విచారణకు అనుమితి ఇస్తే, అప్పుడు ఇస్తాం అని సిఐడి చెప్పింది. వీటన్నింటిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. నాలుగు వారాల పాటు ప్రాసిక్యూషన్ తో పాటు అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకే వర్తిస్తుందని సింగిల్ జడ్జి స్పష్టం చేసిన నేపథ్యంలో రాజధాని తుళ్లూరు మండల గ్రామాల్లో సీఐడీ అధికారులు రైతులు, సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల నుంచి ఏమైనా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దళిత రైతుల తరుపున ఫిర్యాదు చేసాను అంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారించిన సందర్భంగా అసైన్ భూముల వ్యవహారంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూసినట్లు చెప్తున్నారు కానీ, కోర్టు అడిగితే మాత్రం చెప్పలేక పోయారు. ఇదిలా ఉండగా ప్రాసిక్యూషన్ చేసేందుకు సీఆర్ డీఏ చట్టం అనుమతించదని దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడిన నేపథ్యంలో సీఆర్‌డీఏ చట్టంతో పాటు ఇతర క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్‌లను సీఐడీ అధికారులు తిరగేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా సీఐడీ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.