సిక్కోలులో బలమైన నేత, తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో వాయిస్ గా ఉండే కింజరాపు ఎర్రంనాయుడుని, గుర్తు చేస్తూ, ఆయన వారసుడు కింజరాపు రామ్మోహననాయుడుకు ఇప్పటీకే మంచి పేరు వచ్చేసింది. వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం నుంచి, ఢిల్లీలో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు, ఇప్పటికే రెండు సార్లు ఎంపీ అయ్యారు. తండ్రి మరణం తరువాత, చిన్న తనంలోనే రాజకీయల్లోకి వచ్చి, తండ్రిని మరిపిస్తూ,మంచి పేరు తెచ్చుకున్నారు. అందరి వారసుల్లా కాకుండా, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పై, ఢిల్లీ పార్లమెంట్ లో, రామ్మోహన్ నాయుడు చేసిన గర్జన, ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, దేశం మొత్తం ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా 2019లో మోడీ ప్రభుత్వం పై టిడిపి అవిశ్వాసం పెట్టిన సమయంలో, రామ్మోహన్ నాయుడు ఇచ్చిన స్పీచ్, చరిత్రలో నిలిచిపోయింది. ఎర్రంనాయుడుని గుర్తు చేసే విధంగా,హిందీలో గడగడలాడించి, మన హక్కులు అడుగుతూ, ప్రధాని మోడీని నిలదీస్తూ రామ్మోహన్ చేసిన ప్రసంగం, ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ, చిన్న వయసులోనే రామ్మోహన్ నాయుడు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన పని తనానికి గుర్తింపు లభించింది.
శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గ సభ్యులు కింజరాపు రామ్మోహననాయుడుకు 2019-20 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తించి సంసద్ రత్న అవార్డును భారత ముఖ్య ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా, భారత సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్నాయిక్ చేతుల మీదుగా అందుకున్నారు. గత సంవత్సరం పార్లమెంటులో ఎంపి రామ్మోహననాయుడు అత్యుత్తమపనితీరు కనబరచినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.శనివారం ఢిల్లీలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ అవార్డుకు తననకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈసందర్భంగా ఎంపీ రామ్మోహననాయుడు శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఆయన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తాను మరింతగా కష్టపడి పనిచేయడానికి, ప్రజా సమస్యలపై పోరాటం సాగించడానికి కృషిచేస్తానని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతలను పెంచిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవకాశాన్ని తనకు రావడంతో జిల్లా ప్రజలు ఎంపిగా తనను గెలిపించడం వల్లనే సాధ్యపడిందని ఆయన పేర్కొంటూ, జిల్లా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.