2019 ఎన్నికల తరువాత, బీజేపీ పార్టీతో కలిసి పని చేస్తున్న జనసేనకు, ముందు నుంచి బీజేపీ వైఖరి నచ్చనట్టే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణాలో కానీ, బీజేపీ నేతలతో పవన్ ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా కేంద్రంలో బీజేపీ నేతలతో మాత్రం సఖ్యతగానే ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో, జనసేన పార్టీకి తగిన గౌరవం ఇవ్వలేదని, మొదటి నుంచి జనసేన నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. బహిరంగంగానే బీజేపీ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందించటం, స్థానిక బీజేపీ నేతల పై ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే, "మేము తెలంగాణాలో 40కు పైగా స్థానాలు బీజేపీకి వదిలేస్తే, బీజేపీ మనకి సరైన గౌరవం ఇవ్వలేదు, ఆ ఇబ్బంది మనకు ఉంది. మన కార్యకర్తలు మాట్లాడుతూ, ప్రతి సారి మనలని వాడుకుని వదిలేస్తున్నారని అంటే, మరి మనం ఏమి చేయగలం అని అన్నాను. వారు ఒకటే అన్నారు, మా మనోభావాలకు వ్యతిరేకంగా మీరు వెళ్తే, మీ మీద గౌరవంతో మేము కాంగా ఉంటాం కానీ, మా మనోభావాలు మాత్రం కించ పరచవద్దు అని తెలంగాణాలో ఉన్న జన సైనికులు అన్నారు. "
"వారి అభిప్రాయాలు నా దృష్టికి తెచ్చారు, ఇలా అనుకుంటున్నారు అని. మాములుగా ఎన్నికల్లో , ఒక్క ఓటు ఉంటే కూడా, ఒక కుటుంబంలో అయుదు ఓట్లు ఉంటే కూడా మనం గౌరవిస్తాం. మీ మద్దతు మాకు కావలి, మాకు మద్దతు తెలపండి అని అడుగుతాం. ఇన్ని లక్షల మంది జనసేన ఓట్లు తెలంగాణాలో ఉంటే , దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపానికి కలిగించిందని, జన సైనికులు నాకు చెప్పినప్పుడు నేను అర్ధం చేసుకున్నాను. ఎటు వైపు వెళ్ళమంటారని వాళ్ళు అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయమంటారు అని అడిగితే, నేను వారిని ఎటు వైపు వెళ్ళాలని ఉందని, వారినే అడిగాను. వారు చెప్తూ, మాకు మా తెలంగాణా బిడ్డ, ప్రధాన మంత్రిగా చేసి, ఆర్ధిక సంస్కరణలు పెట్టిన వ్యక్తి, అభివృద్ధికి రాజ మార్గం వేసిన వ్యక్తీ, పీవీ నరసింహరావు గారి బిడ్డ పోటీలో ఉన్నారు, వారికి మద్దతు ఇవ్వాలి అనుకుంటున్నామని వారు అంటే, వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, వారికి మద్దతు తెలిపాను. కేంద్రంలో బీజేపీ పెద్దలు మాతో ఉన్నా, తెలంగాణాలో బీజేపీ మాత్రం, కుట్ర చేసింది అనే అభిప్రాయం ఉంది" అని పవన్ కళ్యాణ్ అన్నారు.