ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు వార్డు వలంటీర్లు తమ ఫోన్లను మునిసిపల్ కమిషనర్ల వద్ద డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొబైల్ ను పూర్తి స్థాయిలో నియంత్రించటం వల్ల విధులకు విఘాతం కలుగుతుందని భావిస్తూ అధికారుల అనుమతి మేరకు మాత్రమే వాటిని వినియోగించాలని సూచించింది. అప్పటికీ ఎవరైనా వాటిని దుర్వినియోగం చేశారని భావిస్తే సంబంధిత వలంటీర్లపై చర్యలకు ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయాలని దిశానిర్దేశం చేసింది. వలంటీర్ల మొబైల్ ఫోన్ల విషయంలో ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ గత కొద్ది రోజుల క్రితం సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది. మునిసిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు భాగస్వామ్యం కాకుండా చర్యలే తీసుకోవాలని వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని గత నెల 28న ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏక పక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదిస్తూ ప్రభుత్వం తరుపున వార్డు, గ్రామ సచివాలయాల విభాగం ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ నెల 3న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లను సీజ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి శుక్రవారం అత్యవసర విచారణ నిమిత్తం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని అయితే వలంటీర్లు కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని తేల్చి చెప్పింది. లబ్దిదారులతో మమేకమై వారికి ప్రభుత్వ పథకాలను చేరవేయటమే వలంటీర్ల బాధ్యతగా గుర్తించాలని అదే సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తారనే కమిషన్ వాదనను అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ తరుపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు వివరించారు. వలంటీర్ల విధులపై కమిషన్ ఆంక్షలు విధించటం లేదని ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు మాత్రమే మొబైల్ను స్వాధీనం చేయాలని కమిషన్ ఆదేశించినట్లు చెప్పారు. ఏ పని కోసం ఎవరితో మాట్లాడారో వారినే వివరణ కోరేలా ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం చేసిన సూచనపై న్యాయవాది ఆదినారాయణ రావు స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రక్రియ ముగిసేంత వరకే అని, ఆ పై ఆదేశాలు అమల్లో ఉండ బోవన్నారు.. అవసరమైన మేరకు ఫోన్లను వినియోగించాలని ఓ అధికారి పర్యవేక్షణలో వాటిని డిపాజిట్ చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది..