అధికార వైసిపీ ఎన్నికల్లో చేస్తున్న అరాచకానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు, పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మీడియా సమావేశం పెట్టి ఈ విషయం చెప్పారు. "ఎస్ఈసీ నిన్న ఉదయం 10 గంటలకు చార్జ్ తీసుకొని సాయంత్రం కలెక్టర్ల కాన్ఫిరెన్స్ పెట్టి ఆగమేఘాల మీద నోటిఫికేషన్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి సూచనలే మీరు ఫాలో అవ్వాలా? కనీసం సాంప్రదాయాలు ఎస్ఈసీ పాటించరా? సర్పంచ్ ల పవర్ లు కూడా కట్ చేశారు. రాజ్యాంగ సవరణ 73,74లను తీసుకువచ్చారు. గ్రామానికి సర్పంచ్ లు చాలా ముఖ్యం. ఫైనాన్స్ కమీషన్ నిధులు నేరుగా వారికి వస్తుంటే నేడు వీఆర్వోలకు చెక్ డ్రైవింగ్ లు ఇచ్చారు. ఇవ్వన్ని చూసిన తరువాత వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని తేలింది. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలన్న ధ్యాస లేని, న్యాయస్థానాలంటే కనీసం మర్యాదలు పాటించని ప్రభుత్వమని తేలిపోయింది. ఇలాంటి ఎన్నికల కమీషన్ లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎస్ఈసీ ఒక రబ్బరు స్టాంప్ మాత్రమే. స్వయం ప్రత్తిపత్తిగా వ్యవహరించే పరిస్థితి లేదని ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. నామినేషన్ల సమయంలో మా నాయకులు ఎన్నో బాధలు పడ్డారు. నేడు ఫ్రీ అండ్ ఫేరింగ్ ఎన్నికలు జరుగుతాయని నమ్మకం లేదు. మా అభ్యర్ధులపై మళ్లీ తప్పుడు కేసులు పెట్టరని నమ్మకం లేదని కఠిన నిర్ణయం తీసుకున్నాం. హైకోర్టులో మేము కూడా పిటీషన్ వేశాం. దానిన కూడా రేపు విచారిస్తామని అంటున్నారు. అప్రజాస్వామిక చర్యలకు మేము భాగస్వాములు కాలేం. అందుకే ఎన్నికల బహిష్కరిస్తున్నాం." అని చంద్రబాబు అన్నారు.
అయితే చంద్రబాబు నిర్ణయం పై, విజయసాయి రెడ్డి వెటకారంగా ట్విట్టర్ లో స్పందించారు. అయితే విజయసాయి రెడ్డికి అదే రీతిలో బదులు ఇచ్చారు అచ్చెన్నాయుడు. బహిష్కరణల గురించి నువ్వా మాట్లాడేది, ఇది నీ చరిత్ర అంటూ, అచ్చెన్నాయుడు ట్వీట్ చేసారు. గత తొమ్మిది ఏళ్ళ నుంచి మీరు సిబిఐ విచారణ బాయికాట్ ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు. మూడేళ్ళ పాటు అసెంబ్లీని బాయికాట్ చేసినప్పుడు, ఇవి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 2013లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుంది అంటూ, అప్పట్లో సహకార ఎన్నికలు ఎందుకు బాయికాట్ చేసారని ప్రశ్నించారు. అలాగే 2013లో ఒకసారి, 2015లో ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ లేకుండా అది కూడా బాయికాట్ చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారని అన్నారు. తెలంగాణాలో అసలు ఎన్నికల్లో పోటీనే చేయకుండా , బాయికాట్ చేసినప్పుడు, మీ వీరత్వం ఏమైందని ఎదురు ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలను గౌరవించకుండా, కోర్టులను పట్టించుకోకుండా, పోలీస్ వ్యవస్థతో మీరు చేస్తున్న అరాచకాలకు నిరసనగా, ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.