2019 సాధారణ ఎన్నికలలో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోకసభ నియోజకవర్గానికి ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నడుమ ముఖాముఖి పోరు జరగగా బీజేపీ, కాంగ్రెతో పాటు జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ తదితర అభ్యర్థులు నామమాత్రపు పోటీకి పరిమితమయ్యారు. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గురుమూర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మితో పోటీ పడుతున్నారు. మారిన రాజకీయ సమీకరణాల మేరకు జనసేన పార్టీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 9 సార్లు పోటీచేసి 6 సార్లు గెలిచి, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన డాక్టర్ చింతామోహన్ 10వ సారి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు వామపక్షాల తరఫున సీపీఎం అభ్యర్థిగా పలు ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న నెల్లూరు యాదగరి పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ ఐదుగురు పోటీదారులలో పనబాక లక్ష్మి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా ఈ నెల 29వ తేదీన గురుమూర్తి, రత్నప్రభ, చింతామోహన్, యాదగరి నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అభ్యర్థిత్వాలు ఖరారైన నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ప్రారంభించారు.
తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచార వ్యూహరచనలో నలుగురైదుగురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు తలమునకలవుతున్నారు. దాదాపు మూడు నెలల ముందు నుంచి పలు రకాల ప్రచార వ్యూహాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న బీజేపీ అధినాయకత్వం ఆలస్యంగానే రత్నప్రభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆమెను గెలిపించడానికి జనసేన పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 28వ తేదీ తిరుపతికి రానున్న జనసేన రాష్ట్ర నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇరుపార్టీల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే రత్నప్రభ, జగన్ మోహన్ రెడ్డి పై, వైఎస్ఆర్ పై చేసిన పలు ట్వీట్లు వైరల్ అయ్యాయి. జగన్ గెలిచినప్పుడు, ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్ చేసారు. తరువాత కూడా కొన్ని ట్వీట్ చేసారు. రత్నప్రభ, జగన్ కు అభిమాని అంటూ, ఈ ట్వీట్లు వైరల్ అవ్వటంతో, ఆమె ఈ రోజు స్పందించారు. అప్పట్లో జగన్ మంచి పని చేస్తే, ప్రశంసించాను కాని, ఆ మాత్రానికే ఆయనకు మద్దతు పలుకుతున్నా అని ఎలా అంటారని ప్రశ్నించారు. అయితే ఇక్కడ మంచి చేస్తే ఎవరైనా ప్రశంసించవచ్చు కానీ, ఎన్నికల్లో గెలిస్తే, ఎలేవేషన్ ఇస్తూ చేసిన ట్వీట్ పై, మాత్రం ఆమె నుంచి స్పందన లేదు.