శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు , ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బడ్జెట్ పై ధ్వజమెత్తారు.. ఆయన మాటల్లోనే, "వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఘోరంఘా విఫలమైంది. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్ తెచ్చేంత దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఏమున్నాయో అంతుచిక్కడం లేదు. తప్పనిసరిగా బడ్జెట్ సమావేశాలు జరిపి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా.. రూ.70,983 కోట్లతో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్రంలోని అసాధారణ పరిస్థితులను బహిర్గతం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలను మరియు రుణాలని కన్సాలిడేటెడ్ ఫండ్ లో ఉంచుతారు. రాజ్యాగం ప్రకారం నిర్దిష్టమైన కారణాలు లేకుండా ఈ నిధులను విత్ డ్రా చేయడానికి వీలుపడదు. కానీ ఇలాంటి ప్రత్యేక కేటాయింపులకు ఎక్కువ సమయం పడుతున్నందున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇలాంటి పరిస్థితుల వలన స్వల్ప కాలంలో ప్రభుత్వం నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేయడానికి వీలవుతుంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చర్చలను లాంఛన ప్రాయంగానే పరిగణిస్తారు తప్ప తప్పనిసరి కాదనే నియమాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు మరియు తిరుపతి ఉప ఎన్నికలను సాకుగా చూపి తప్పనిసరిగా జరపాల్సిన బడ్జెట్ సమావేశాల కూడా ఆర్డినెన్స్ తో నెట్టుకొస్తోంది. 2019లో ఎన్నికల సంవత్సరం కారణంగా.. టీడీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2020-21కి సంబంధించి కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఫిబ్రవరి-మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడితే జగన్ సర్కారు మాత్రం మూడు నెలల ఆగి జూన్ లో ప్రవేశపెట్టి.. కరోనాను సాకుగా చూపించి ఆర్డినెన్సుతో బడ్జెట్ ఆమోదించుకున్నారు. ఈ ఏడాది 14 రాష్ట్రాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాయి. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఫిబ్రవరి, మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఏప్రిల్ 1 తర్వాత నుండి రోజువారీ ఖర్చులకు కూడా అనుమతి అవసరమైనందున.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డునెన్స్ ద్వారా బడ్జెట్ ఆమోదింపజేసుకుంటోంది. అందుకు చూపించిన కారణాలు కేవలం సాకులు తప్ప మరేమీ కాదనే విషయం వారికి కూడా తెలుసు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.70,983 కోట్లు తీసుకునేందుకు మద్దతు లభించింది. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి నెలలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 కోట్లు అధనంగా అప్పు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.80,000 కోట్లు అప్పు చేసింది. ద్రవ్య లోటు రూ.79,192 కోట్లు, 2020-21 ఆర్ధిక సంవత్సర మొత్తం బడ్జెట్ కంటే ఈ అప్పులు 164% ఎక్కువ. ప్రభుత్వం యొక్క రుణాలు పెరిగేకొద్దీ వడ్డీ చెల్లింపు వంటి ఆదాయేతర ఖర్చులు మరింత ఎక్కువ అవుతాయి. దీంతో పన్నులు, ధరలు పెరిగి ప్రజలపై భారం పెరుగుతుంది. గత 11 నెలల్లో పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.68,821 కోట్లు ఆదాయం రాగా.., ఒక్క ఫిబ్రవరిలో రూ.7,573 కోట్లు జమయ్యాయి. ఇదే సమయంలో ఓటు-ఆన్- అకౌంట్ బడ్జెట్ లో ఆదాయం, ప్రజా రుణం, ఆర్థిక లోటు, దేశీయ ఉత్పత్తి రంగాల వారీగా గణాంకాలకు సంబంధించిన సమాచారం ఏదీ పేర్కొనాల్సిన అవసరమే లేదు. అదే సమయంలో మునుపటి సంవత్సరానికి సంబంధించి ప్రజా వ్యయాలను కూడా వివరించాల్సిన అవసరం లేకపోవడంతోనే జగన్ సర్కారు ఓటాన్ ఎకౌంట్ ను వినియోగించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే.. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమని అర్ధమైంది. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజల్ని ఫూల్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టలేనంతటి అసాధారణ పరిస్థితులు రాష్ట్రంలో ఏమున్నాయో సమాధానం చెప్పే సాహసం చేయగలరా.?

Advertisements

Advertisements

Latest Articles

Most Read