ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 2018 నుంచి 2019 వరకు నరేగా పనులు చేసిన వారికి, గత రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించటం లేదు అంటూ, రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయవాది వీరా రెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ల పై దాదాపుగా ఎడాదిగా విచారణ జరుగుతుంది. ఈ విచారణ సందర్భంగా, చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామీ ఆధ్వర్యంలో ఉన్న బెంచ్ విచారణ చేపట్టింది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పందిస్తూ, కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెప్పారు. అయితే దీని పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 నుంచి 2019 వరకు బిల్లులు రాకపోతే, ఆ తరువాత సంవత్సరాలకు బిల్లులు ఎలా వచ్చాయని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. పైగా, 5 లక్షల రూపాయలు ఉన్న బిల్లులకు, 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్ట్ కు చెప్పి, ఆ డబ్బులు తరువాత ఎందుకు ఇవ్వలేదని, హైకోర్టు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో దీని పై తమకు పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోతే మాత్రం, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని, హైకోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని, ధర్మాసనం హెచ్చరించింది.
ఏడు లక్షల పనులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, పిటీషనర్ తరుపు న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్ళించారని వారు కోర్టుకు తెలిపారు. అందు వల్లే అసలు ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి, కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఎంత రావాలి, ఈ నిధులు వివరాలు ఏంటి, కేంద్రం నుంచి నిధులు రాలేదని ప్రభుత్వం చెప్తుంటే, ఆ తరువాత ఏడాదికి నిధులు ఎలా వచ్చాయో, వీటి అన్నిటి పై, రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఎన్నో రోజులు నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉన్నా, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఒకవేళ పూర్తి స్థాయి అఫిడవిట్ లో, తమకు కావాల్సిన వివరాలు అన్నీ రాకపోతే, చీఫ్ సెక్రటరీ ని వచ్చే వాయిదాకి హైకోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.