తెలుగుదేశం పార్టీలో అత్యున్నత కమిటీ అయిన పొలిట్‌బ్యూరో సమావేశం ఈ రోజు అత్యవసరంగా జరగనుంది. ఈ రోజు ఉదయం పది గంటలకు, ఈ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. వైరస్ వ్యాప్తి దృష్టిలో పెట్టుకుని, ఈ సమావేశం ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా నిన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా వచ్చిన ఎన్నికల కమీషనర్ నీలం సాహ్నీ, నోటిఫికేషన్ ఇవ్వటం. ముఖ్యంగా అనేక ఫిర్యాదులు వచ్చినా, వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినా, ఎవరి వాదనలు పట్టించుకోకుండా, ప్రభుత్వం చెప్పినట్టు చేసారనేది ఆరోపణ. ఏడాది క్రితం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో, నామినేషన్ సందర్భంగా వైసీపీ వర్గాలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. నామినేషన్ వేసే వారిని మధ్యలో ఎత్తుకు పోవటం, అలాగే కిడ్నాప్ చేయటం, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఏకంగా బుద్దా వెంకన్న, బొండా ఉమా ని చంపటానికి చూడటం, ఇవాన్నీ జరిగాయి. దీంతో చాలా మంది కనీసం నామినేషన్ కూడా వేయలేక పోయారు. అధికారులు, పోలీస్ కూడా అధికార పక్షానికి కొమ్ముకాస్తుంది అనేది ఆరోపణ. దీంతో 2014లో 2 శాతం ఉన్న ఏకాగ్రీవాలు, మొన్న 30 శాతం వరకు వెళ్ళాయి. అయితే ఈ ఎన్నికలు మధ్యలో ఆగిపోయాయి.
దీంతో ఏడాది తరువాత జరిగే ఎన్నికలు కాబట్టి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టిడిపి కోరుతుంది. అయితే కొత్త ఎన్నికల కమీషనర్ మాత్రం, పాత వాటిని కొనసాగించారు. దీంతో, తెలుగుదేశం పార్టీ రెండు విషయాల పై ఆలోచిస్తుంది. దీని పై న్యాయ పోరాటం చేయాలని ఒకటి. రెండోది, ఎన్నికల బహిష్కరణ. ప్రభుత్వం అరాచకాలను ఎదుర్కున్న నిమ్మగడ్డ ఉండగానే, వైసీపీ ఆరాచకం చేసిందని, ఇప్పుడు తమకు అనుకూలమైన వారిని పెట్టుకుని, ఇంకా ఎంతో అరాచకం చేస్తుందని, ఈ విషయం ప్రజలకు వివరించి, అసలు ఇలాంటి ఎన్నికల్లో ఎందుకు పాల్గునాలి అని, ప్రజల మధ్య చర్చ పెట్టి, ఎన్నికల బహిష్కరిస్తే ఎలా ఉంటుంది, అనేది కూడా టిడిపి ఆలోచన. ఈ రెండు అంశాల పై చర్చించేందుకు, తెలుగుదేశం పార్టీ ఈ రోజు అత్యవసరంగా పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో పాల్గునకపోతే, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలి, ఒకవేళ పోటీ చేస్తే, అన్నీ ప్రజలకు వివరించి, ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయమని, ప్రజలకు వివరించే అవకాసం పై చర్చ జరిగే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.