ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు అయిన ఒక కేసులో, కావాలని జాప్యం చేస్తూ, కోర్టు ముందుకు రాకుండా జాప్యం చేసే విధంగా చేసిన ఉదంతం, ఇప్పుడు సంచలనం అయ్యింది. సాక్ష్యాత్తు హైకోర్టు ధర్మాసనం, ఈ విషయం గుర్తించింది. బాధ్యుల పై చర్యలకు ఉపక్రమించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనలోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గత నాలుగు నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్య, ఒక చిన్న సైజు వార్ నడిచింది. ఒకరి పై ఒకరు పై చేయి సాధించటానికి, చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కోర్టుల్లో పోరాడి పోరాడి, ప్రతి సారి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గెలుస్తూ వచ్చారు. ఇదే సందర్భంలో, ఎన్నికల నిర్వహణలో, ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల కమిషన్ కు సంపూర్ణ సహకారం అందించాలని, హైకోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం వైపు నుంచి తనకు సహకారం అందటం లేదు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సాహనీ, అలాగే పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, ప్రస్తుత చీఫ్ సెక్రటరీ పై కూడా కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు.
అయితే ఈ పిటీషన్ నిన్న విచారణకు వచ్చింది. ఈ పిటీషన్ పై విచారణ చేసిన హైకోర్టు, ఈ పిటీషన్ విచారణ ముగిసినట్టు ఉత్తర్వులు ఇస్తూ, ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ తరుపు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, తాము పిటీషన్ వేసిన తరువాత, నిధులను విడుదల చేస్తూ, సహకారం అందించే విషయంలో, ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. దీంతో ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్ పై విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇదే సందర్భంలో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్, 42 రోజులు పాటు కోర్టు ముందుకు విచారణకు రాలేదని, దీని పై జాప్యం జరిగిందని, నెంబర్ కేటాయించలేదని, ఈ కేసు విచారణకు రాకుండా చేసిన హైకోర్టులోని ఒక సెక్షన్ ఆఫీసర్ , లాగే డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ పై, సోమోటోగా తీసుకుని, కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. అయితే అసలు ఈ కేసు జాప్యం చేయమని, వీరికి ఎవరు చెప్పారు, అసలు ఎందుకు జాప్యం చేసారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.