అనంతపురం జిల్లాలో మంత్రి దూకుడు మాటలకు, అక్కడ ఉన్న ప్రభుత్వ మహిళా డాక్టర్ కంటతడి పెట్టిన ఘటన కలకలం రేపింది. మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలకు అక్కడ మహిళా డాక్టర్ మీడియా ముందే కంటతడి పెట్టుకోగా, అక్కడ ఉన్న మిగతా సిబ్బంది ఆమెకు బాసటగా నిలిచారు. ప్రభుత్వం వైపు నుంచి అరకొర సౌకర్యాలు వస్తున్నా, సరిపడా సిబ్బంది లేకపోయినా, తాము ఎక్కడ ఇబ్బంది లేకుండా విధుల్లో పాల్గుని, రాష్ట్రంలోనే ఈ హాస్పిటల్ కు మంచి పేరు తీసుకురాగా, మంత్రి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పై, వారు కూడా మీడియా ముందు ధీటుగా స్పందించారు. తమపై వేటు వేసినా సరే, తాము దేనికైనా సిద్ధం అని అంటున్నారు. ఇక సంఘటన వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో, ఇరు వర్గాల ప్రజల మధ్య జరిగిన గొడవలో, వైసీపీకి చెందిన ఇద్దరికీ గాయాలు అయ్యాయి. రెండు వర్గాలు వైసీపీ వారే కావటం గమనార్హం. అయితే దెబ్బలు తగిలిన వీరిని, నిన్న రాత్రి 11.30 ప్రాంతంలో అనంతపురం జిల్లా, పెనుకొండలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. వారికి అప్పుడే విధుల్లో ఉన్న వైద్యులు చికిత్స అందించారు. అయితే తమ వర్గం వారు కావటంతో, ఈ రోజు ఉదయం రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకర్నారాయణ హాస్పిటల్ కు వెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతున్న తమవారిని పరామర్శించారు. ఈ నేపధ్యంలోనే హాస్పిటల్ పని తీరు పై, అక్కడ ఉన్న సౌకర్యాల పై, అక్కడ ఉన్న వైద్యులు, సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది, కొన్ని సమస్యలు చెప్పగా వారి పై మంత్రి ఫైర్ అయ్యారు. ఇక్కడ వైద్యులు సకాలంలో స్పందించటం లేదని, సరిగ్గా డ్యూటీలు చేయటం లేదని, ప్రైవేటు క్లినిక్ లు పెట్టుకుని, అక్కడే ఉంటున్నారని అక్కడ ఉన్న డాక్టర్ల పై మండి పడ్డారు. వెంటనే వైద్యశాఖ ఉన్నతాధికారులను ఫోన్ చేసి, ఇక్కడ ఉన్న వైద్యులకు మేమోలు ఇవ్వాలని, వారి పై చర్యలు తీసుకోకపోతే, నీ మీద చర్యలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మంత్రి మాటలకు అక్కడే ఉన్న మహిళా డాక్టర్ సుకన్య కంటతడి పెట్టారు. తాము ఇక్కడ ఎంతో నిబద్దతో పని చేస్తున్నామని, సౌకర్యాలు, నిధులు లేకపోయినా, కష్టపడి రాష్ట్రంలోనే ఈ హాస్పిటల్ కు మంచి ర్యాంక్ తెచ్చిపెడితే, మంత్రే ఇలా తమ పై ఆరోపణలు చేయటం ఆవేదన కలిగిస్తుందని వాపోయారు. ఇక మంత్రి వ్యాఖ్యల పై స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బుడం సాహెబ్, సిబ్బంది కొరత, ఇక్కడ ఉన్న ఇబ్బందులు చెప్తూ, ఇంతలా కష్టపడుతున్న మమ్మల్ని ఇలా అనటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు.