గత నాలుగు రోజులుగా వివేక పేరు రాష్ట్రమంతా మారుమోగుతుంది. నాకు న్యాయం చేయండి అంటూ, వివేక కుమార్తె, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ, వేడుకున్నారు. తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, న్యాయం జరగనుందుకే ఇక్కడ దాకా వచ్చానని అన్నారు. అంతే కాదు, పులివెందుల అనేది వైఎస్ ఫ్యామిలీకి పెట్టిన కోట అని, అక్కడకు మా ఇంటికి వచ్చి, ఈ ఘటన చేసే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. ఇవన్నీ వివిధ పత్రికలు, మీడియా, చివరకు రాజకీయ పార్టీలు కూడా అందుకున్నాయి. సొంత చెల్లికి ముందు న్యాయం చేయాలని, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా, అదే విషయం లేవనెత్తారు. అయితే ఎప్పుడు కూడా వివేక కేసు పై స్పందించటానికి ఇష్టపడని వైసీపీ నేతలు, నిన్నటి నుంచి స్పందిస్తున్నారు. అయితే ఈ రోజు ఏకంగా విజయమ్మ లేఖ రాసారు. ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు కుట్ర, పచ్చ మీడియా కుట్ర అంటూ, ఎప్పటిలాగే విమర్శలు గుప్పించారు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అని, అప్పుడు ఏమి చేసారని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఎందుకు అడగరు, సిబిఐ విచారణ పై ఎందుకు కేంద్రాన్ని నిలదీయరు అని పవన్ పై కూడా విరుచుకు పడ్డారు. మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అనుమానం వచ్చేలా కధనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
ఎవరు నేరం చేస్తే, వారిని శిక్షించాలని, మా అందరిదీ అదే మాట అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తూ విజయమ్మ , 5 పేజీల లేఖ రాసారు. అయితే విజయమ్మ లేఖ పై అనేక సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అసలు ముందుగా, ఈ బహిరంగ లేఖ ప్రజలకు కాకుండా, వైఎస్ సునీతా రెడ్డికి రాసి ఉంటే, బాగుండేది అని, ఆమె అడిగిన ఒక్క ప్రశ్నకు అయినా సమాధానం చెప్పి ఉంటే, ఆమె ఆవేదన తీరేదని అంటున్నారు. ఇక మరో విషయం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరగలేదని, నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఘటన జరిగిందని, పది రోజుల్లోనే ఇంటలిజెన్స్ డీజీని, కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి, కేసు నీరుగారి పోయేలా చేసారని అంటున్నారు. ఇక మరో విషయం, అసలు జగన్ మోహన్ రెడ్డి, ఎందుకు సిబిఐ విచారణ వద్దని, పిటీషన్ వెనక్కు తీసుకున్నారో, విజయమ్మ చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఈ రెండేళ్ళలో, ఒక్కటంటే ఒక్క అరెస్ట్ కూడా జరగకపోవటం, ఈ కేసు దాదాపుగా తొమ్మిది నెలల పాటు, రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేసిన విషయం గుర్తు చేస్తున్నారు. రాజకీయ ఆరోపణలు చేసారు కానీ, కూతురు వరుస అయ్యే సునీత ఆవేదనకు మాత్రం, విజయమ్మ సమాధానం చెప్పలేక పోయారని అంటున్నారు.