తాడేపల్లి రాజ భవనం నుంచి, రెండేళ్లుగా బయటకు వచ్చి, ప్రజల మధ్యలోకి వెళ్ళని జగన్, ఎట్టకేలకు బయటకు వస్తున్నారు. ఈ రెండేళ్ళలో, గట్టిగా ఒక పది సార్లు కూడా జగన్ ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు. అది క-రో-నా కాలంలో అయినా, అంతకు ముందు ఏడాది అయినా. అయితే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు బయటకు రావటం, అది ప్రజల్లోకి వెళ్ళటం, ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ? తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు అడగటానికి, జగన్ తిరుపతి వస్తున్నారు. ఇన్నాళ్ళు 5 లక్షల మెజారిటీతో గెలుస్తాం అంటూ ధీమాలు పోయిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఇంటలిజెన్స్ రిపోర్ట్ లో, తేడా కొట్టటంతో, చేసేది లేక, తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. 5 లక్షల మెజారిటీ సంగతి తరువాత, మొన్న వచ్చిన మెజారిటీ కూడా వచ్చేలా లేదని రిపోర్ట్ రావటంతో జగన్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పది రోజులు సమయం ఉండటం, ఈ లోపు పరిస్థితి దిగజారి పోతుంది కాబట్టి, ఆ డామేజ్ కంట్రోల్ చేయటానికి, జగన్ స్వయంగా రంగలోకి దిగుతున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం పెద్ద వింత కాకపోయినా, జగన్ లాంటి స్వభావం ఉన్న వ్యక్తి, అలాగే ఇన్నాళ్ళు బయటకు రాని జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు బయటకు రావటం, ఆలోచించాల్సిన విషయమే.
తిరుపతి ఉప ఎన్నిక పార్లమెంట్ పరిధిలో, ఏడు నియోజకవర్గాలు ఉండగా, ప్రతి నియోజకవర్గం నుంచి 70 వేల మెజారిటీ రావాలని టార్గెట్ పెట్టారు. అయితే వెంకటగిరి నియోజకవర్గం మినహా, ఎక్కడా ఆశించిన స్థాయిలో లేదని రిపోర్ట్ లు వచ్చినట్టు తెలుస్తుంది. కనీసం 2019లో వచ్చిన రెండు లక్షల పైగా వచ్చిన మెజారిటీని నిలుపుకోవాలి అంటే, కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి రావాల్సిందే అని రిపోర్ట్ లు రావటంతో, జగన్ మోహన్ రెడ్డి 14వ తేదీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. అక్కడ రోడ్ షో కూడా చేసి, ఎన్నికల సభలో పాల్గునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరో పక్క బీజేపీ ఎత్తుకున్న హిందూ వాదం, తెలుగుదేశం పార్టీకి లాభించే అవకాసం ఉన్నట్టు కూడా వైసీపీకి సమాచారం వచ్చింది. బీజేపీ పై ప్రజలకు నమ్మకం లేకపోవటం, వైసీపీ, బీజేపీ ఒకటే అని ప్రజల్లోకి బలంగా వెళ్ళటంతో, ఈ హిందూ అంశం పై కూడా, గట్టిగా సమాధానం చెప్పాలని, జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి జగన్ ఉప ఎన్నికల ప్రచారానికి రావటం చూస్తుంటే, వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది.