తూర్పు గోదావరి జిల్లాలో, 2020 జూలై 21వ తారీఖున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. వరప్రసాద్ అనే వ్యక్తి మీద శిరోముండనం చేసిన ఘటన సంచలనం అయ్యింది. అయితే శిరోముండనం బాధితుడు వరప్రసాద్ నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి అదృశ్యం అవ్వటం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ, నామినేషన్ల పర్వం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడ కొంత మంది నామినేషన్ వేయటానికి వచ్చిన అభ్యర్ధులు, వరప్రసాద్ ని అవమానించే విధంగా మాట్లాడటం, అలాగే అక్కడ తన పై గతంలో ఇబ్బంది పెట్టిన వారు కూడా ఉండటంతో, వరప్రసాద్ మానసికంగా కుంగిపోయి, అక్కడ నుంచి ఇంటికి వేల్లిపోయినట్టు తెలుస్తుంది. మనస్తాపంతో ఇంటికి వచ్చిన వరప్రసాద్, తన భార్యతో భోజనం పెట్టమని చెప్పి, అక్కడ తనకు జరిగిన అవమానాన్ని భార్యతో చెప్పి బాధపడ్డారు. అందరూ బాగానే ఉన్నారు, తనకే ఈ అవమానాలు అంటూ, భోజనం దగ్గర నుంచి లెగిసి బయటకు వెళ్లిపోయారని, ఇంట్లో వాళ్ళు చెప్పారు. అయితే వరప్రసాద్ రాత్రి వరకు తిరిగి రాకపోవటంతో, ఇంట్లో వాళ్ళు కంగారు పడి, పోలీసులకు ఫిర్యాదు చేసారు.
చుట్టు పక్కల బంధువులు, అలాగే తన స్నేహితులు ఇళ్ళలో కూడా వాకబు చేయగా, వరప్రసాద్ అక్కడ కూడా లేరని తెలిసి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు పై, పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. అన్ని కోణాల్లో ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సీతానగరం ప్రజలు షాక్ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఇలా జరగటం పై, ఆందోళన నెలకొంది. అయితే ప్రసాద్ ఎక్కడకు వెళ్లారు అనే దాని పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రసాద్ ని బెదిరించింది ఎవరు ? ఎవరు అవమానించారు అనే దాని పై, ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం లేదు. గతంలో కూడా వరప్రసాద్ తనకు న్యాయం జరగలేదు అంటూ, ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని, అందుకే నక్సల్స్ లో కలిసి, తానే న్యాయం చేసుకుంటానని, అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరారు. అయితే దీని పై విచారణ చేయమని రాష్ట్రపతి కోరినా, ఇప్పటికీ దీని పై ఏమి జరిగిందో తెలియదు. ఈ సందర్భంలో వరప్రసాద్ అదృశ్యం అవ్వటం, ఇప్పుడు సంచలనంగా మారింది.