ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ సారి ఉద్యోగులకు అక్షింతలు పడ్డాయి. బుధవారం రాష్ట్రంలో ఉన్న అధికారుల పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక కోర్టు ధిక్కరణ పిటీషన్ విచారణకు వచ్చిన సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% అధికారులు తాము చట్టాని కంటే ఎక్కువ అనే భావనలో ఉండి, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని అమలు చేయటం లేదని కోర్టు వాపోయింది. ఇక కేసు విషయానికి వస్తే, కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ ఫర్ ఉమెన్ అనే కాలేజీలో ఆర్వీ పాపారావు అనే వ్యక్తీ అటెండర్ గా పని చేస్తున్నారు. టైం స్కేల్ ప్రకారం తనకు జీతం ఇవ్వాలి అంటూ, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలి అంటూ, ఆయన 2017లో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో దీనికి సంబందించిన పిటీషన్ వేసారు. దీనికి సంబంధించి 2018లో హైకోర్టు ఈ కేసు విచారణ చేసి, ఆర్వీ పాపారావు వేసిన పిటీషన కు అనుమతి ఇస్తూ, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి అంటూ, హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలు కాకపోవటంతో, ఆయన కోర్టులో మరో పిటీషన్ వేసారు. ఈ సారి కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసారు. అయితే, ఈ పిటీషన్ ను విచారణకు తీసుకున్న హైకోర్టు సంబధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
వారు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. కోర్టు నోటీసులు తీసుకున్న తరువాత కూడా అధికారులు కోర్టుకు హాజరు కాలేదు. ఈ పిటీషన్ బుధవారం విచారణకు వచ్చింది. జస్టిస్ బట్టు దేవానంద్, ఈ పిటీషన్ ను విచారించి, అధికారుల ప్రవర్తన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రాష్ట్రంలో అధికారులు చట్టాని కంటే ఎక్కువ అనే భావనలో ఉండి, కోర్టు ఆదేశాలు కూడా పాటించటం లేదని వాపోయారు. సంబంధిత అధికారులు అందరి పై నాన్ బైలబుల్ వారంట్ జారీ చేసారు. వారంట్ తీసుకున్న వారిలో ఎండోమెంట్స్ కమీషనర్ అర్జున్ రావు, స్పెషల్ కమీషనర్ అఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎంఎం నాయక్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ అఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ డేవిడ్ కుమార్, కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ ఫర్ ఉమెన్ కాలేజీ ఆఫీసర్ కు, కోర్టు ఆదేశాలు పాటించనందుకు, నాన్ బైలబుల్ వారంట్ జారీ చేసారు. గతంలో హైకోర్టు ఇలా అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేయటం అనేక సార్లు జరిగింది. ఏకంగా డీజీపీ, చీఫ్ సెక్రటరీలను పలు మార్లు పిలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.