ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న చట్ట వ్యతిరేక చర్యల పై హైకోర్టు బ్రేక్ వేస్తూనే ఉంది. ముఖ్యంగా వ్యక్తుల పై కక్ష తీర్చుకునే విధంగా తీసుకున్న నిర్ణయాలు, హైకోర్టులో బ్రేక్ పడుతూనే ఉంది. ముఖ్యంగా అశోక్ గజపతి రాజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఆయన్ను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాన్సాస్ చైర్మెన్ గా అయన్ను తొలగించటం దగ్గర నుంచి, మొన్న రామతీర్ధం ఘటన వరకు, ఏదో ఒక విధంగా అయన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రామతీర్ధం విషయంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఏపి హైకోర్టులో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఈ రోజు రామతీర్ధాలులో విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న వేళ, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారికి మాత్రం, ఊరట లభించింది. రామతీర్ధం వివాదం సమయంలో, చంద్రబాబుతో పాటు అశోక్ గజపతి రాజు కూడా ఆ రోజు, రామతీర్ధం వెళ్ళిన సందర్భంలో, అదే రోజు, రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా ఉన్న ఆయన్ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రామతీర్ధంతో పాటు, మొత్తం మూడు గుడులకు సంబంధించి ఆయన్ను తొలగించారు. రామతీర్ధం ఘటనకు బాధ్యుడిని చేస్తూ, ఆయన్ను ప్రభుత్వం ఈ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, ప్రభుత్వం తీసుకున్న చర్య పై, అశోక్ గజపతి రాజు , హైకోర్టులో చాలెంజ్ చేసారు. ఎండోమెంట్ ఆక్ట్ ప్రకారం, ఏదైనా తప్పు చేస్తే, ముందుగా నోటీసులు జారీ చేసి, సంజయషీ తీసుకుని నోటీసులు జారీ చేయాలని, అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే, నిర్ణయం తీసుకుందని ఆయన పిటీషన్ లో తెలిపారు. అయితే ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. హైకోర్టులో అశోక్ గజపతికి రాజుకు అనుకులంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టేసింది. రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు కొనసాగనున్నారు. అశోక్ గజపతి రాజు పై ప్రభుత్వం వేధిస్తున్న తీరుకి, ఇది ప్రభుత్వానికి చెంప పెట్టు అనే చెప్పాలి. తీర్పు పై అశోక్ ట్విట్టర్ లో ఇలా స్పందించారు. "రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా నన్ను తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్ట్ వారు ఈ రోజు కొట్టివేయడం జరిగింది. ఈ రోజు రామతీర్ధాలులో విగ్రహ ప్రతిష్ట అని టీ.వి. వార్తల ద్వారా తెలిసింది. ఈ శుభదినాన ఆ శ్రీ రామచంద్రుడే నన్ను ఆశీర్వదించి ఆయనకు సేవ చేసుకొనే భాగ్యాన్ని మళ్ళీ కలిగించారు అని భావిస్తున్నాను."