ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఘాట్ లో, నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మనకు దూరం అయి 25 ఏళ్ళు అయినా, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు అంటే, ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచి పోయాయి అని చెప్పటానికి నిదర్శనం అని అన్నారు. ఎన్టీఆర్ పేరు వినగానే శత్రువులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి అని అన్నారు. సినిమాల్లో కానీ, రాజకీయల్లో కానీ, ఆయన రారాజు అని, ఆయన సృష్టించిన చరిత్ర, భవిష్యత్తులో కూడా ఆయన్ను అందుకోలేరని అన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి తీసుకొచ్చిన అనేక పధకాలు, సమాజంలో ఎంతో మార్పు తీసుకుని వచ్చాయని, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన నిలిచారని అన్నారు. దేశంలో సంక్షేమం అనే పదానికి నిర్వచనం తెచ్చింది ఎన్టీఆర్ అని, ఇప్పటికీ ఆయన స్పూర్తితోనే పధకాలు ఉన్నాయని అన్నారు. దేశ రాజకీయాల్లో కూడా అయన తన ముద్ర వేసుకున్నారని గుర్తు చేసారు. అయితే ఈ సందర్భంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న అనేది, కేవలం అయన జయంతి, వర్ధంతికి ఇచ్చే డిమాండ్ గానే చూడాలా, ఎప్పుడు సాధిస్తారు అని విలేఖరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పారు.
"తప్పకుండా సాధించాలి. భారత దేశం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నాన్ కాంగ్రెస్ పార్టీలు అన్నీ ఏకతాటి పైకి తీసుకుని వచ్చి, ఒక స్పూర్తి ఇచ్చిన వ్యక్తీ ఎన్టీఆర్. అదే మారిగా దేశంలో కూడా రాజకీయాలకు వన్నె తెచ్చారు. ఇప్పటికే ఆయనకు భారత రత్న లేట్ అయ్యింది. ఆయన వందో పుట్టిన రోజుకి అయినా భారత రత్న ఇవ్వాలి. దాని కోసం మేము పోరాడతాం, సాధిస్తాం." అని అన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ సమాధి కూల్చేస్తాం అంటూ, కొన్ని పార్టీలు చేసిన వ్యాఖ్యల పై స్పందన అడగగా, చంద్రబాబు స్పందించారు. "ఎన్టీఆర్ సమాధి కుల్చేస్తాం అని ఎవడైనా అంటే, అది మన సంస్కృతిని కూలదోసినట్టే. ఆ ఆలోచనే ఎవరికీ రాకూడదు. ఆయన ఏమి చేసారు తెలుగుజాతి అనేది గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఎవరికీ వివాదాస్పదం కాదు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. రాజకీయాలు కోసం, అలాంటి వ్యక్తిని, వివాదాల్లోకి లాగకండి. ఎవరూ అలాంటి సాహసం చేయవద్దు అని కోరుతున్నా" అని చంద్రబాబు అన్నారు. అలాగే తెలంగాణాలో పార్టీ పరిస్థితి పై అడగగా, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణాలో, తెలుగువారి కోసం ఎప్పుడూ, ఎక్కడైనా కృషి చేస్తూనే ఉంటాం అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/7BuPj85uiIY